
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. వాహనసేవ ఆస్థానం తరువాత స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఏకాంతంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు.
మార్చి 13న త్రిశూలస్నానం :
బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మార్చి 13వ తేదీన త్రిశూలస్నానం ఏకాంతంగా జరుగనుంది. ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారి ఆస్థానం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు త్రిశూల స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు రావణాసుర వాహనం ఆస్థానం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రెడ్డిశేఖర్, శ్రీనివాస్‌నాయక్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply