
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు శుక్రవారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించాడు.
ఎనిమిదవరోజు రాత్రి స్వామివారు అశ్వంపై కూర్చొని, తనవేగశక్తినీ, బలశక్తినీ నిరూపిస్తుంటారు. వేగశక్తి అశ్వలక్షణం. సృష్టిలో యజ్ఞం తర్వాత పుట్టిన జీవి గుర్రమే! తర్వాతనే ఆవులూ, మేకలూ మున్నగు జంతువులు రూపొందాయి.
ప్రయాణసాధనాల్లో మునుపు అశ్వానిదే అగ్రస్థానం. ఇప్పటికీ ఒకయంత్రంశక్తిని ‘హార్స్పవర్’ అనే పేరుతో గణించడం మనకు తెలుసు. రథాన్ని లాగేవి గుర్రాలే! యుద్ధాలలో ఆశ్వికదళం అధికంగా ఉంటుంది.
శ్రీహరి శ్రీనివాసుడై ఈలోకంలో వేంకటాచలం చేరి, అటనుండి పద్మావతీదేవిని పెండ్లాడడానికై మొట్టమొదట వేటనెపంతో గుర్రంపైన్నే వచ్చాడు. ఆ గుర్రమే తనకు వివాహవాతావరణాన్ని కల్పించడంలో ప్రముఖసాధనమైంది.
శ్రీహరి యొక్క జ్ఞానావతారాల్లో మొదటిది హయగ్రీవావతారమే! అంటే గుర్రంముఖం కల్గినమూర్తి. హయగ్రీవుడు విద్యాధిదేవత. ఈకారణాలవల్లనూ స్వామికి బ్రహోత్సవవాహనసేవల్లో మొదట పెద్దశేషవాహనం కుండలినీ యోగానికి సంకేతం.
చివర అశ్వవాహనం ఓంకారానికి సంకేతమై – కుండలినీ యోగంతో ప్రణవాన్ని (ఓంకారాన్ని) చేరి, ఆనందించే తత్త్వాన్ని ఆద్యంత ఉత్సవాలు నిరూపిస్తున్నాయి. చక్కని సమన్వయాన్ని కల్గిస్తున్నాయి.
ఇంతేకాక ఈ కలియుగాంతంలో స్వామి కల్కిమూర్తియై గుర్రంపై పయనిస్తూ – ఖడ్గధారియై దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. కనుక ఈ అశ్వవాహనత్వం కల్కి అవతారాన్ని గుర్తుచేస్తూంది.
ఇంద్రునికి ఏనుగుతోపాటు గుర్రం కూడా వాహనంగా ఉంది. ఆధ్యాత్మికంగా పరమాత్మే అశ్వం. ఆయనే మనహృదయంలోఉండి, ఇంద్రియాల్ని నియమిస్తున్నాడు.
Leave a Reply