
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ కల్యాణ శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుని అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి.
వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు.
చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఎల్లయ్య, ఏఈవో ధనంజయుడు, ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Leave a Reply