
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది.
మాడ వీధులు జనంతో నిండిపోయాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గరుడ సేవలో పాల్గొనడానికి ఎగబడ్డారు. గరుడ వాహనంపై స్వామి చూసి తరించారు.
రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు.
గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు.
ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
Leave a Reply