గెరిగె నృత్యం…., చండమేళం…. తిరుచానూరు ప్రత్యేకం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో చండ మేళం, గెరిగ‌ నృత్యం, భ‌ర‌త‌నాట్యం, కోలాటం త‌దిత‌ర క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

కేర‌ళ రాష్ట్రం కొళ్లాం ప్రాంతంలోని కొడ‌గ‌ల్‌కు చెందిన శ్రీ గోవింద‌మ‌ణి బృందం 35 ఏళ్లుగా తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో చండ‌మేళం(కేర‌ళ డ్ర‌మ్స్‌) వాయిస్తున్నారు.

ఈ బృందంలో మొత్తం 13 మంది క‌ళాకారులు ఉన్నారు. వీరు డ్ర‌మ్స్‌, తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. ఈ వాయిద్య ప్ర‌ద‌ర్శ‌న ఎంతో విన‌సొంపుగా ఉంటుంది.

వీరు టిటిడి ఆధ్వ‌ర్యంలోని ఒంటిమిట్ట కోదండ‌ రామాల‌యం, తిరుప‌తిలోని క‌పిలేశ్వ‌ర ఆల‌యం, గోవింద‌రాజ‌ స్వామివారి ఆల‌యం, కోదండ‌రామాల‌యం, శ్రీనివాస‌ మంగాపురంలోని క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ రాల‌యంలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల్లోనూ చండ మేళం వాయిస్తారు.

తూర్పుగోదావ‌రి జిల్లా మ‌క్కామ‌ల‌కు చెందిన శ్రీ కుమార్ బృందం గెరిగె నృత్యాన్ని చ‌క్క‌గా ప్ర‌ద‌ర్శించారు. మొత్తం 14 మంది క‌ళాకారులు ఉండ‌గా, వీటిలో గెరిగెలు 6, తాశాలు 4, తంబుష‌లు 4 ఉన్నాయి. తాశాలు, తంబుష‌లు వాయిస్తుండ‌గా మిగ‌తా క‌ళాకారులు త‌ల‌పై గెరిగెలు ఉంచుకుని ర‌మ్యంగా నృత్యం చేశారు.

అదేవిధంగా, చెన్నైకి చెందిన శ్రీ‌మ‌తి అంజ‌నా వినోద్‌కుమార్ ఆధ్వ‌ర్యంలోని శ్రీ క‌లాక్షి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ బృందం 22 క‌ళాకారుల‌తో చ‌క్క‌టి భ‌ర‌త‌నాట్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*