తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 23 నుండి డిసెంబరు 1వ తేదీ వరకు జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆలయంలో శుక్రవారం రాత్రి జరిగిన అంకురార్పణ కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల కోసం రూ.1.44 కోట్లతో ఇంజినీరింగ్ పనులు చేపట్టామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, భక్తుల కోసం తాత్కాలిక లగేజి కౌంటర్లు, సెల్‌ఫోన్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటుచేశామన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఫలపుష్ప, ఆయుర్వేద, శిల్పకళా ప్రదర్శనశాలలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. పంచమితీర్థం నాడు టిటిడి భద్రతా సిబ్బంది 350 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్.సి.సి.విద్యార్థులు 200, శ్రీవారి సేవకులు 200, పోలీస్ సిబ్బంది 1500 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని వెల్లడించారు.
భక్తులకు వైద్యసేవలందించేందుకు అదనంగా 8 మంది డాక్టర్లు, 15 మంది పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 300 శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందితో పారిశుద్ధ్య చర్యలు చేపడతామని తెలిపారు.
రోజుకు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామని, పంచమితీర్థం నాడు తోళప్పగార్డెన్స్, జడ్పి హైస్కూల్, నవజీవన్ ఆసుపత్రి, తనపల్లి క్రాస్ వద్ద 160 కౌంటర్ల ద్వారా 60 వేల మందికి అన్నప్రసాదాలు, 30 వేల మందికి అల్పాహారం, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలియజేశారు.
వాహనసేవలను తిలకించేందుకు వీలుగా తిరుచానూరులోని వివిధ ప్రాంతాలు, పద్మ పుష్కరిణి వద్ద 10 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలతోపాటు ఉదయం, రాత్రి వాహనసేవలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్, ఇతర ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కళాబృందాల ప్రదర్శనలిస్తాయని చెప్పారు. వాహనసేవల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Leave a Reply