
సామాజిక మాధ్యమాలు వేదికగా ఇటీవల టిటిడిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని, వదంతులను భక్తులు నమ్మవద్దని ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో ఆదివారం ఈవో మీడియాతో మాట్లాడుతూ కొన్నిరోజుల క్రితం 2500 సంవత్సరాల తరువాత శ్రీవారి ఆలయాన్ని మూసివేశారని సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేశారని చెప్పారు.
పెద్దజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు కైంకర్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయని తెలియజేశారు.
ప్రతిరోజూ స్వామివారి కల్యాణం ఎస్వీబీసీలో ప్రత్యక్షప్రసారం చేస్తున్నామని, ఉగాది ఆస్థానం, శ్రీరామనవమి ఆస్థానం, వసంతోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని వివరించారు.
అదేవిధంగా, టిటిడి నిధులను క్రైస్తవులకు, ముస్లింలకు జీతాలు చెల్లించేందుకు వినియోగిస్తున్నారు కావున హుండీలో కానుకలు వేయకూడదని మరో దుష్ప్రచారం జరిగిందని ఈవో తెలిపారు.
కాగా, వసంతోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం మొదటి గంట నైవేద్యం, రెండో గంట నైవేద్యం వెంటవెంటనే పెట్టారని, ఇది అపచారమని సామాజిక మాధ్యమాల్లో వదంతులను వ్యాప్తి చేశారని ఈవో చెప్పారు.
ఇలాంటి ఈ వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని, స్వామివారి కైంకర్యాలన్నీ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని వెల్లడించారు.
ఈ విషయాన్ని గతంలో పెద్దజీయర్ స్వామి, ఆలయ ప్రధానార్చకులు కూడా తెలియజేశారని వివరించారు.
ఇలా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నవారు శిక్షకు అర్హులని, అలాంటివారిని స్వామివారు క్షమిస్తారో లేదో చూడాలన్నారు.
Leave a Reply