తిరుప‌తిలో టిటిడి ఆహార‌పొట్లాలు పంపిణీ

  • బ‌ర్డ్ ఆసుప‌త్రిలోనూ క‌రోనా వైద్య స‌దుపాయం
  • స్విమ్స్‌లో అవ‌స‌ర‌మైన వెంటిలేట‌ర్లు కొనుగోలుకు సాయం

ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు టిటిడి త‌ర‌ఫున అన్నివిధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేదవిజ్ఞాన పీఠంలో మూడు రోజుల పాటు జ‌రిగిన శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శ‌నివారం మ‌హాపూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి ఈవో క‌రోనా వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ క‌రోనా కోవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్ కార‌ణంగా కొంత మంది ఆహారం దొర‌క్క ఇబ్బందులు ప‌డుతున్నార‌ని త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు.

టిటిడి బోర్డు ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి సూచ‌న‌ల మేర‌కు ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు ద్వారా మార్చి 28వ తేదీ నుండి తిరుప‌తిలో ఆహార పొట్లాల పంపిణీని ప్రారంభించామ‌ని తెలిపారు.

అవ‌స‌ర‌మైతే ఒక పూట‌కు 50 వేల ఆహార‌పొట్లాలు త‌యారుచేసి పంపిణీ చేసేందుకు టిటిడి సిద్ధంగా ఉంద‌ని వివ‌రించారు.

బ‌ర్డ్ ఆసుప‌త్రి కేటాయింపు

రాయ‌ల‌సీమ జిల్లాల నుండి క‌రోనా అనుమానిత కేసులు ఎక్కువగా తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుప‌త్రికి వ‌స్తున్నాయ‌ని, అవ‌స‌ర‌మైతే బ‌ర్డ్ ఆసుప‌త్రిని కూడా వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స అందించేందుకు, క్వారంటైన్‌గా వినియోగించుకునేందుకు అనుమ‌తి ఇచ్చామ‌ని ఈవో వెల్ల‌డించారు.

ఇందుకోసం టిటిడి అధికారులు త‌గిన ఏర్పాట్లు చేసిన‌ట్టు చెప్పారు.

ఇప్ప‌టికే తిరుప‌తిలోని రుయా ఆసుప‌త్రితోపాటు స్విమ్స్‌, ప‌ద్మావ‌తి వైద్య క‌ళాశాల‌లో క‌రోనా వ్యాధి అనుమానితుల కోసం త‌గిన ఏర్పాట్లు చేశార‌న్నారు.

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యం వ‌స‌తి స‌ముదాయాన్ని క్వారంటైన్ కేంద్రంగా వినియోగిస్తున్నార‌ని తెలియ‌జేశారు.

వెంటిలేట‌ర్లు కొనుగోలుకు సాయం

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వెంటిలేట‌ర్ల కొర‌త ఉంద‌ని తెలుస్తోంద‌న్నారు.

స్విమ్స్‌లో ప్ర‌స్తుతం ఉన్న వెంటిలేట‌ర్లు, ఇంకా ఎన్ని అవ‌స‌ర‌మ‌వుతాయి అనే అంశంపై జిల్లా క‌లెక్ట‌ర్ శ‌నివారం ఉద‌యం స‌మీక్షించార‌ని చెప్పారు.

అవ‌స‌ర‌మైన వెంటిలేట‌ర్ల‌ను కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామ‌ని ఈవో తెలిపారు..

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*