ఒకే శిలలో ఐదు రూపాలు!…. ఎక్కడ?

తిరుమలలో పంచబేరాలున్నాయి. అవి అన్నీ కూడా వేర్వే విగ్రహాలే. ఒకే శిలపై శివకేశవులు ఉన్నారని విన్నాం. అది తొండవాడలో. కానీ, ఒకే శిలలో ఐదు రూపాలు ఎక్కడైనా విన్నారా?

ఎక్కడుంది? అని తెలుసుకోవాలని ఉంది కదా? అయితే మనం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరుకు వెళ్ళాల్సిందే అక్కడున్న సుబ్రమణ్యం స్వామిని ఆలయం గురించి తెలుసుకోవాల్సిందే.

అక్కడ ‘ఏక శిల ఏక పడగ సప్త శిరస్సాసన శ్రీచక్రసహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః’ అనే శ్లోకంతో పూజలు ప్రారంభమవుతాయి. ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిస్తాయి.

ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలూ దర్శనమిస్తాయి.

సుమారు అయిదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీవ్యాసరాయలు సర్ప స్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి, దేవాలయాన్ని నిర్మించాడు.

పంపనూరు క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏడు శిరస్సులతో దర్శనమిస్తాడు. ఇక్కడి మూలవిరాట్టును ఒకే శిలతో ఐదు రూపాలు స్ఫురించేలా మలిచారు.

విగ్రహం పీఠం నుంచి శిరసు వరకూ ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది.

ఇందులో పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవికీ, ఆపై భాగంలో చుట్టలు చుట్టేసినట్లుగా కనిపించే సర్పం నాగేంద్రుడికీ, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడి ఆకారంలో గణపతికీ ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

మూలవిరాట్టు మధ్యభాగం శివలింగంగా దర్శనమిస్తుంది. సర్పం శిరస్సు భాగం ఏడు తలలతో పడగవిప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు. ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలందుకుంటోంది.

మూలవిరాట్టుకు ఇరువైపులా నెమలి పింఛాలతో కూడిన చక్రాలు ఉన్నాయి.

సుబ్రహ్మణ్యేశ్వరుడి మూలవిగ్రహం ఐదు శక్తి రూపాలతో వెలసి ఉండటం, శివుడూ పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు… ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట, ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం ఇక్కడి విశేషం.

ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు.

ప్రధానంగా శ్రావణ మాసంలో శతసర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం, అష్టోత్తర కలశాభిషేకం, మూలవిరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు.

కార్తికమాసం మూడో ఆదివారం ఉసిరి చెట్టు, తులసీమాత, బృందావనానికి తులసీదామోదర కల్యాణోత్సవం జరిపిస్తారు. అదేరోజు ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు.

ప్రతి మాఘమాసం రెండో ఆదివారంనాడు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. మహా శివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరాన ఉన్న కైలాసద్వార ప్రవేశం కల్పిస్తారు.

ఇవే కాకుండా ప్రధాన పండగలైన ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, నాగులచవితి, షష్ఠి రోజుల్లో ప్రత్యేక అభిషేకాలూ, విశిష్ట అలంకరణలూ, విశేష పూజలూ నిర్వహిస్తారు.

ప్రతి నెలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన శుద్ధ షష్ఠి తిథిలో అభిషేకం, సహస్రనామార్చన, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేస్తారు.

అనంతపురం నుంచి కల్యాణదుర్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉందీ ఆలయం. బస్టాండ్‌ నుంచి నేరుగా ఆలయానికి బస్సు సౌకర్యం కూడా ఉంది.

అనంతపురం నుంచి కల్యాణదుర్గం, రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో పంపనూరు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో ఇక్కడికి రావచ్చు.

ప్రతి ఆదివారం, మంగళవారం ఇక్కడి అన్న దాన సమాజం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ముఖ్య పర్వదినాలలో అన్నదానం చేస్తారు.

అలాగే ఇక్కడ హోమం చేస్తారు. రాహు, కేతు దోష నివారణ వివాహ దోష నివారణ, కు ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు.

108ప్రదక్షణలు చేయడం, అనుకున్న వారాలసంఖ్య లో ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరుతయు అన్ననమ్మకం భక్తులలో అపారం.

5, 9, 11ఇలా వారాలలో ప్రదక్షిణాలు, పల్లకి అభిషేక సేవలు ప్రాధాన్యత సంతరించు కున్నాయి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*