వేదాలు విజ్ఞాన భాండాగారాలు : రాష్ట్ర గ‌వ‌ర్న‌రు బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్

వేదాలు విజ్ఞాన భాండాగారాల‌ని, ఆధునిక మాన‌వ స‌మాజం శాంతి సౌఖ్యాల‌తో జీవించ‌డానికి వీటిలోని అంశాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయ‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌రు గౌ. శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఉద్ఘాటించారు.

తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 5వ స్నాత‌కోత్స‌వం గురువారం ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర సూక్ష్మ‌, చిన్న మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ మంత్రి ప్ర‌తాప్‌చంద్ర సారంగి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌రు ప్ర‌సంగిస్తూ భార‌తీయులకు పూర్వీకుల నుండి వార‌స‌త్వంగా వేదాలు అందాయ‌ని, వీటిని వ్యాప్తి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అన్నారు.

వేద ప‌రిర‌క్ష‌ణ‌, ప్ర‌చారానికి టిటిడి విశేషంగా కృషి చేస్తోంద‌ని అభినందించారు.వేదాల్లో ఆధ్యాత్మిక జ్ఞానంతోపాటు సాంకేతిక ప‌రిజ్ఞానం దాగి ఉంద‌న్నారు.

వేదాలు, ఉప‌నిష‌త్తులు, పురాణాలు, భ‌గ‌వ‌ద్గీత లాంటి గ్రంథాలు మాన‌వీయ‌, నైతిక‌, ధార్మిక విలువ‌ల‌ను మాన‌వాళికి బోధిస్తాయ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ వాటిని చ‌ద‌వాల‌ని కోరారు.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు అంద‌రూ పాటుప‌డాల‌ని, గౌ.ప్ర‌ధాన‌మంత్రి కోరిక మేర‌కు పెద్ద ఎత్తున మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు.

కేంద్ర స‌హాయ మంత్రి శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగి స్నాత‌కోప‌న్యాసం చేస్తూ వేదాలు చాలా శ‌క్తిమంత‌వైన‌వ‌ని, ఇవి ఏక‌త్వాన్ని ప్ర‌బోధిస్తాయ‌ని తెలిపారు. వేద విద్య అజ్ఞానాన్ని దూరం చేసి ఆత్మ‌జ్ఞానాన్ని అందిస్తుంద‌న్నారు.

గంగాన‌దిలో స్నానం చేస్తే ప‌విత్ర‌త ల‌భించిన విధంగానే, వేద‌పండితులు, సంస్కృత పండితుల‌ను క‌ల‌వ‌డం వ‌ల్ల త‌న‌కు ఆ భాష ప‌రిచ‌య‌మైంద‌ని చెప్పారు.

ఒక‌ప్పుడు సంస్కృతం ప్ర‌పంచ భాష‌గా ఉండేద‌ని, అన్ని భాష‌లు దాని నుండే ఉద్భ‌వించాయ‌ని తెలియ‌జేశారు.

మ‌హామ‌హోపాధ్యాయ పుర‌స్కారం పొందిన‌ బ్ర‌హ్మ‌శ్రీ మ‌ద్దుల‌ప‌ల్లి సూర్య‌నారాయ‌ణ ఘ‌నాపాఠి మాట్లాడుతూ వేద విద్య నేర్చుకున్న విద్యార్థులు తిరిగి కొంద‌రికి నేర్పాల‌ని, ఆ విధంగా వేద వ్యాప్తికి కృషి చేయాల‌ని కోరారు.

వాచ‌స్ప‌తి పుర‌స్కారం పొందిన శ్రీ‌ చాగంటి ప్ర‌కాశ‌రావు ప్ర‌సంగిస్తూ విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర మ‌హాస్వామి ఆశీస్సుల‌తో వేద‌స‌భ‌లు నిర్వ‌హిస్తూ వేద విద్య‌ను విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్న‌ట్టు తెలిపారు.

ఎస్వీ వేద వ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌నశ‌ర్మ మాట్లాడుతూ వేద విద్య వ్యాప్తికి చేస్తున్న కృషిని, వ‌ర్సిటీ ప్ర‌గ‌తిని తెలియ‌జేశారు.

వేద విద్య‌ను అభ్య‌సిస్తున్న విద్యార్థుల‌కు రూ.ఒక లక్ష నుండి రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రోత్సాహ‌కాలు అందిస్తున్నామ‌ని తెలిపారు.

వేదాల‌కు ప్రాచుర్యం క‌ల్పించేందుకు పుస్త‌కాలు ముద్రిస్తున్నామ‌ని, రాత‌ప్ర‌తులను ప‌రిష్క‌రిస్తున్నామ‌ని, వేదాలు, ఉప‌నిషత్తుల‌ను రికార్డింగ్ చేస్తున్నామ‌ని వివ‌రించారు.

పుర‌స్కారాలు ప్ర‌దానం…

తిరుప‌తికి చెందిన వేద‌పండితుడు మ‌ద్దుల‌ప‌ల్లి సూర్య‌నారాయ‌ణ ఘ‌నాపాఠికి మ‌హామ‌హోపాధ్యాయ పుర‌స్కారం, కేంద్ర స‌హాయ మంత్రివ‌ర్యులు, సంస్కృత పండితులైన‌ ప్ర‌తాప్‌చంద్ర సారంగికి,

విశాఖ‌ప‌ట్నంకు చెందిన శాస్త్ర పండితుడు చాగంటి ప్ర‌కాశ‌రావుకు వాచ‌స్ప‌తి పుర‌స్కారాలను గ‌వ‌ర్న‌రు అంద‌జేశారు.

అదేవిధంగా, 2017, జూలై 13 నుండి 2019, జూలై 31 వ‌ర‌కు ఉత్తీర్ణులైన 200 మందికి బ్యాచిల‌ర్స్ డిగ్రీ, 104 మందికి మాస్ట‌ర్ డిగ్రీ, ఇద్ద‌రికి ఎంఫిల్‌, ఐదుగురు విద్యార్థులకు పిహెచ్‌డి ప‌ట్టాలు ప్ర‌దానం చేశారు.

జాతీయ‌స్థాయిలో క్రీడ‌లు, సాంస్కృతిక అంశాలు, ప‌రిశోధ‌నాప‌త్రాలు పొంది ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు ప్ర‌శంసాప‌త్రాలు అంద‌జేశారు.

పుస్త‌కావిష్క‌ర‌ణ‌లు

ఈ సంద‌ర్భంగా గరుడ పురాణము ఆంధ్ర వ్యాఖ్యాన సహిత, పితృ మేధా సూక్తము, మధ్యందిన సంహిత క్రమ పాట, శివపురాణం మహాత్మ్యము పుస్త‌కాల‌ను గౌ. గ‌వ‌ర్న‌రు ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, అర్బ‌న్ ఎస్పీ శ్రీ ఆవుల ర‌మేష్‌రెడ్డి, డిఈవో డా. ఆర్‌.ర‌మ‌ణ‌ప్రసాద్‌, రిజిస్ట్రార్ శ్రీ రామ‌చంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*