
ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.
ఇక్కడ లక్ష్మి పుట్టింది. అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.
కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం. ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.
మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.
ఈమె నీ లక్ష్మి. ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ.
మారే వరకు బుట్టలోనే కూర్చుంటుంది. బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు. మేనమామలు ప్రేమైక మూర్తులు. లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది.
నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.
మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది. అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు.
ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను.
భర్తృ భావనతో చూడలేదు.
పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు. అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.
అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక? నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి.
అధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు. వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు. ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి.
Leave a Reply