ఉద్యోగుల ఆరోగ్యానికి క్రీడలు : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

టిటిడిలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ అన్నారు.

టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన జెఈవో ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధంగానే టిటిడిలోనూ ఉద్యోగుల క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పెద్దసంఖ్యలో క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు.

మరింత మంది ముందుకు వచ్చి ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని కోరారు.అంతకుముందు టిటిడి ఉద్యోగుల పిల్లలకు వేషధారణ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

కాగా, వివిధ క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జెఈవో చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

విజేతలుగా నిలిచిన వారికి రూ.2 వేలు, రన్నర్లకు రూ.1800/-, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.1600/- గిఫ్ట్ ఓచర్లు అందజేశారు. 545 మంది ప్రథమ, 536 మంది ద్వితీయ, 93 మంది తృతీయ బహుమతులు అందుకున్నారు.

మొత్తం వివిధ విభాగాల్లో 1,174 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 702 మంది పురుషులు, 456 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

అనంతరం టిటిడి వార్షిక క్రీడా పోటీల నివేదికను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో స్నేహలత, పిఆర్వో డా. టి.రవి, ట్రెజరీ డెప్యూటి ఈఓ దేవేంద్రబాబు, ఇఇ మల్లికార్జునప్రసాద్, డిఇ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*