స‌ర్వ‌భూపాల‌ వాహనంపై క‌ల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగపురం బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత  క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు శ్రీ గోవింద‌రాజ‌స్వామి అలంకారంలో స‌ర్వ‌భూపాల  వాహనంపై భక్తులను కటాక్షించారు.

రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

నాలుగవ నాటి రాత్రి సమస్త రాజ లాంఛనాలతో సర్వభూపాల వాహనసేవ అద్భుతంగా ఉంటుంది. భూమిని పాలించేవాడు భూపాలుడు.

సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది.

ఆ భూగ్రహాలన్నింటినీ పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం. ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు.

మా ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్‌ కల్యాణమూర్తికి వాహనమైపోతారు.

అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి ఊరేగడమే సర్వభూపాల వాహనసేవ.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డెప్యూటీ ఈవో ఎల్ల‌ప్ప‌, ఏఈవో ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌  చెంగ‌ల్రాయులు, ప్రధాన అర్చ‌కులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్‌, భ‌క్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*