
శ్రీనివాసమంగపురం బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు రాజగోపాలస్వామివారి అలంకారంలో చర్నాకోలు, దండం దరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.
ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి
కల్యాణ వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి.
ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలూ శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు.
శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.
కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఎల్లప్ప, ఏఈవో ధనంజయుడు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఆలయ అర్చకులు, ఇతరులు పాల్గొన్నారు.
Leave a Reply