
శ్రీనివాస మంగాపురంలోని వేంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందిన ఆలయం. కళ్యాణ వేంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? అంత ప్రాధన్యత ఏమిటి? తెలుసుకోవాలని ఉందా?
కల్యాణం అంటే వివాహం మొకటే కాదు, సంతానం, సౌభాగ్యం, గృహవసతి, ఆరోగ్యం, ఐశ్వర్యం అనే ఎన్నో అర్థాలున్నాయి.
ఇలాంటి కోరికలను తీరాలంటే కళ్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాల్సిందేనంటున్నాయి పురాణాలు. కాబట్టే, స్వామికి కల్యాణ వేంకటేశ్వరస్వామి అనే పేరు సార్థకమైంది.
సువర్ణముఖీ-కల్యాణీ-భీమా నదుల త్రివేణీ సంగమ పవిత్ర జలాలు ప్రవహించిన పుణ్యభూములకు ఆలవాలం ఈ ప్రాంతం. అగస్త్య మహర్షి వంటి తపోమూర్తుల ఆశ్రమవాటికలకు నిలయం ఈ ప్రాంతం.
నూతన వధూవరులైన పద్మావతీ శ్రీనివాసు లిద్దరూ ఇక్కడ విహరించడంవల్ల పావనమైన కల్యాణపురం శ్రీనివాస మంగాపురప్రాంతం. వేదపురుషుడైన వేంకటేశ్వరునికి నాలుగువేదాలను వినిపించిన ఘనాపాఠుల అగ్రహారాలకు నిలయం ఈ ప్రాంతం.
స్వామి ఆరగించే దివ్యాన్నాలకోసం, ఇక్కడ మాగాణిభూముల్లో సన్నని రాజభోగాల వడ్లను పండించే రైతన్నలకు నిలయం ఈ ప్రాంతం.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రాంతం మధ్యలో కేంద్రబిందువై కల్యాణ పరంపరల్ని గుప్పిస్తూన్న ఆలయమే శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరుని దేవాలయం.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతినిత్యం జరుగుతున్న కల్యాణోత్సవంలో పాల్గొని, స్వామికి దరింపచేసిన కల్యాణ కంకణాలు దరిస్తే ఆరు మాసాలలోపు కల్యాణం అయ్యెలా స్వామివారు వరం ఇచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు తెలిపారు.
అంతేగాక స్వామివారి కల్యాణం జరిపించిన దంపతులు, అవివాహితులు స్వామికి కట్టిన రక్ష బంధనాన్ని ధరించి స్వామి అనుగ్రహన్ని పొందుతున్నారన్నారు.
స్వామికి ఎంతో ఇష్టమైన ప్రదేశం
శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారు అగస్త్యేశ్వరక్షేత్రానికి కొత్త పెండ్లికొడుకైన శ్రీనివాసుడు తన దేవేరి పద్మావతితో తిరుమలకు వెళ్తూ ఇక్కడికి వచ్చాడు.
అక్కడున్న అగస్త్య మహాముని పసుపుబట్టలతో ఉన్న ఆ నూతన వధూవరు లను ఆశీర్వదించి, వారు ఆ వస్త్రాలతో కొండెక్కడం నిషేధమని, ఆరుమాసాలదాకా ఇక్కడే ఉండండని ఆత్మీయంగా చెప్పాడు. ఇక చేసేదేమీలేక శ్రీనివాసుడు అంగీకరించాడు.
మనోజ్ఞమైన వాతావరణానికి శ్రీనివాసమంగాపురం పెట్టింది పేరు. ఇక్కణ్ణుంచి శ్రీవారిమెట్టుమార్గంగుండా తిరుమల చేరడానికి దగ్గరిదోవ.
శేషాచలకొండల అంద చందాలను చూస్తూ ఆరుమాసాలు గడిపిన స్వామి అగస్త్య మహాముని అనుమతి తీసుకొని భార్యాసమేతంగా శ్రీవారి మెట్టుమార్గంగుండా తిరుమల చేరినాడు. అలా శ్రీవారి మెట్లు, అమ్మవారి కాలిమెట్లు రెండూ సోకిన ఈ కాలిమార్గం ఎంతో పవిత్రమైంది.
తదనంతరకాలంలో చంద్రగిరి రాజ్యాన్ని ఏలిన రాజులెందరో చంద్రగిరి కోటనుంచి శ్రీవారి ఆలయంవరకు ఏర్పడిన సరళమార్గాన్నను సరించి స్వామి దర్శనం చేసుకొని పునీతులైనారు.
Leave a Reply