కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం ఉదయం 9.45 నుండి 10.10 గంటల మధ్య మీన‌లగ్నంలో జరిగిన ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రం శాస్త్రోక్తంగా జరిగింది.

అంతకుముందు ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు.

అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు.

మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు.

ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠిస్తారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి.

18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.

ఆల‌య  ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ శేషాచార్యులు ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ పురాతనమైన కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 14 నుండి 22వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం రూ.26 ల‌క్ష‌ల‌తో ఇంజినీరింగ్ ప‌నులు చేపట్టామన్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 18న గరుడసేవ, ఫిబ్ర‌వ‌రి 19న‌ స్వర్ణరథోత్సవం, ఫిబ్ర‌వ‌రి 21న రథోత్సవం, ఫిబ్ర‌వ‌రి 22న‌ చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తులు సంతృప్తిక‌రంగా వాహ‌న‌సేవ‌లతో పాటు మూల‌మూర్తిని చేసుకునేలా ఏర్పాటుచేశామ‌న్నారు.

ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.

బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను రద్దు చేసినట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి 500 మందికి, ప్ర‌త్యేకంగా గ‌రుడ‌సేవ‌నాడు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

అదేవిధంగా రూ.6.75 ల‌క్ష‌ల‌తో విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు, 7 ట‌న్నుల పుష్పాల‌తో ఆకర్షణీయంగా పుష్పాలంకరణలు ఏర్పాటు చేశామన్నారు.

100 మంది టిటిడి భ‌ద్ర‌తా సిబ్బంది, 300 మంది శ్రీ‌వారి సేవ‌కులు, 100 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భ‌క్తుల‌కు సేవ‌లందించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

శ్రీ‌నివాస‌మంగాపురంలో తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా  భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపారు.

ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.

వాహనసేవల్లో వివిధ జిల్లాల నుండి కళాబృందాలు ప్రదర్శనలివ్వనున్నట్టు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

గొడుగులు విరాళం -శ్రీ

క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా త‌మిళ‌నాడుకు చెందిన తిరునందూరుకు చెందిన తిరునందూరు శ్రీ రామానుజ కైంక‌ర్య ట్ర‌స్టువారు రెండు గొడుగుల‌ను శుక్ర‌వారం ఉద‌యం బ‌హుక‌రించారు.

ఆల‌యం ముందు  ఈ గొడుగుల‌ను టిటిడి ఈవో, జెఈవోల‌కు అందించారు. ప్ర‌తి రోజు స్వామివారి వాహ‌న‌సేవ‌ల‌లో ఈ గొడుగుల‌ను అలంకరించనున్నారు.

ఈ కార్యక్రమంలో అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌  శ్రీ చెంగ‌ల్రాయులు,

టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, వైఖానస ఆగమ సలహదారులు శ్రీ సుందరవరద బట్టాచార్యలు, శ్రీ మోహన రంగాచార్యులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*