దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణం స‌ర్వ‌త్రా శుభ‌క‌రం : చిన్న‌జీయ‌ర్‌స్వామి

దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణం శుభక‌ర‌మైంద‌ని, లోకంలో అమంగ‌ళం న‌శించేందుకు అన్ని వైష్ణ‌వాల‌యాల్లో దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణం జ‌ర‌గాల‌ని టిటిడి గోవింద‌రామానుజ చిన్న‌జీయ‌ర్‌స్వామి ఉద్ఘాటించారు.

టిటిడి ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెట్టిన దివ్య‌ప్ర‌బంధ మ‌హోత్స‌వంలో భాగంగా ఆదివారం తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో నాలాయిర దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణ ప‌థ‌కంలోని దాదాపు 200 మంది పండితుల‌తో స‌మావేశం జ‌రిగింది.

ఈ స‌మావేశంలో చిన్న‌జీయ‌ర్‌స్వామి మంగ‌ళాశాస‌నాలు చేస్తూ 12 మంది ఆళ్వార్లు రచించిన 4 వేల‌ పాశురాల సమాహారమే నాలాయిర దివ్య ప్రబంధమ‌న్నారు.

ఇందులో వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని, శ్రీ‌వారి ఇత‌ర రూపాల‌ను ఆళ్వార్లు కీర్తించార‌ని తెలిపారు. దివ్య‌ప్ర‌బంధంలో భ‌క్తి, శ‌ర‌ణాగ‌తి ముఖ్య పాత్ర పోషిస్తాయ‌న్నారు.

నాలాయిర దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణ ప‌థ‌కం ద్వారా విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు.

ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ మాట్లాడుతూ టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు నాలాయిర దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణ ప‌థ‌కంలోని పండితుల ద్వారా విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు.

ఈ ప‌థ‌కంలో ప్ర‌స్తుతం 230 మంది పండితులు ఉన్నార‌ని, ఇంకా 270 మంది పండితుల‌ను నియ‌మించేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశామ‌ని వెల్ల‌డించారు.

దివ్య‌ప్ర‌బంధం వ్యాఖ్యానాల‌ను పున‌ర్ ముద్ర‌ణ చేయ‌డం, ఇత‌ర భాష‌ల్లోకి అనువాదం చేయ‌డం ద్వారా భ‌క్తుల్లోకి తీసుకెళుతున్నామ‌ని వివ‌రించారు.

హైద‌రాబాద్‌కు చెందిన కెకె.ప‌ర‌కాల‌న్ స్వామి మాట్లాడుతూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా 12 ఏళ్ల క్రితం తాను నాలాయిర దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేశాన‌ని తెలిపారు.

వేదార్థాల‌ను అంద‌రికీ తెలియ‌జేసేందుకు ఆళ్వార్లు దివ్య‌ప్ర‌బంధ పాశురాల‌ను ర‌చించార‌ని తెలియ‌జేశారు.

ఈ ప‌థ‌కం ద్వారా శ్రీ‌వారి అప‌ర‌భ‌క్తులైన ఆళ్వార్ల వైభ‌వం న‌లుదిశ‌లా వ్యాప్తి చెందుతోంద‌న్నారు. అనంత‌రం టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ ఎల్‌.విజ‌య‌సార‌థి, ఏపిఆర్వో కుమారి పి.నీలిమ ప్ర‌సంగించారు.

దివ్య‌ప్ర‌బంధ గోష్ఠిగానం :

దివ్య‌ప్ర‌బంధ మ‌హోత్స‌వంలో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు, తిరిగి సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు పండితులు దివ్యప్రబంధ గోష్ఠిగానం నిర్వహించారు.

అనంత‌రం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో జీయ‌ర్‌స్వాముల వెంట పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాదాపు 200 మంది దివ్య‌ప్ర‌బంధ పండితులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*