స్వామి వారికి శంఖు చక్రాలు లేవా? ఇప్పుడున్నవి ఏమిటి?

శంఖు చక్రాలు లేని వేంకటేశ్వర స్వామిని మీరు ఎక్కడైనా చూశారా? ఇది మరీ విడ్డూరమైన ప్రశ్న. అపచారం కదా? స్వామికి శంఖు చక్రాలు లేకపోవడమా… ఇది ఊహించుకోవడానికి సాధ్యం కాదు. కలలో కూడా ఈ మాట వినబడరాదు. అలా స్వామి కనబడరాదు. స్వామిపై అపర భక్తి కలిగిన వారెవ్వరైనా ఇదే చెబుతారు.

కానీ, వేంకటేశ్వర స్వామి విగ్రహానికి అస్సలు శంఖు చక్రాలే ఉండేవి కావు. మరి ప్రస్తుతం ఉన్న శంఖు చక్రాలు ఎలా వచ్చాయి? ఎవరికైనా వచ్చే ఇదే సందేహం కలుగుతుంది. అదే సమయంలో అది కూడా నిజమేనని చరిత్ర చెబుతోంది.

తిరుమల శ్రీవారు అలంకార ప్రియుడు అందుకే ఆయన నిత్యం దగదగలాడే నగలతో తులతూగుతూ భక్తులకు దర్శనం ఇస్తాడు. కానీ మీరు నిజరూప దర్శనానికి ఎప్పుడైనా వెళ్లారా? వెళ్లి ఉంటే మీకు ఏం కనిపించింది. స్వామి ఒక ఒక వస్త్రంతో ఎటువంటి అలంకరణలు లేకుండా దర్శనమిస్తారు. నిశితంగా గమనించి ఉంటే విగ్రహమంతా రాయిపై చెక్కినది. కానీ స్వామి చేతలపై ఉన్న శంఖు చక్రాలు మాత్రం బంగారుతో చేయబడినవిగా కనిపిస్తాయి. మీరు కులశేఖర పడి నుంచి దర్శనం చేసుకున్నప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రాతి విగ్రహంపై శంఖుచక్రాలు రాతితో ఎందుకు లేవు?

ఇదే అంశం వెయ్యే కిందటి వరకూ పెద్ద దుమారం రేపింది. అప్పట్లో వైష్ణువులకు, శైవులకు మధ్యన పెద్ద పెద్ద వాదోపవాదనలు నడిచాయి. దీనిపై కొట్లాటలు కూడా జరిగాయి. శంఖు చక్రాలు లేవు కనుక అక్కడ కొలువై ఉన్నది అసలు విష్ణు రూప విగ్రహమే కాదని అప్పట్లో శైవుల వాదన. దీనిని బట్టి మనకు అర్థమవుతున్నదేంటి.? అంటే అప్పట్లో శంఖుచక్రాలు లేవనే మాట స్పష్టం . వెయ్యో శతాబ్ధంలో ఒక యాదవ రాజు దీనిపై వైష్ణవు, శైవుల మధ్య పెద్ద చర్చ నిర్వహించారు. రామానుజాచార్యుల వారు ఆ చర్చలో పాల్గొని వైష్ణవుల తరపున తన వాదన వినిపించారు. ఈ అంశాన్ని మరో సందర్భంలో చెప్పుకుందాం.

ఇది మనం గాలికి చెప్పుకుంటున్న మాట ఎంత మాత్రం కాదు. చారిత్రక ఆధారాలున్నాయి. 6, 7 శతాబ్దాల నుంచి శాసనాలు ఉన్నా, స్పష్టంగా 9 శతాబ్దం నుంచే తిరుమలకు సంబంధించిన ఆధారాలు దొరుకుతున్నాయి. పల్లవ రాజకుమారి సమవాయి స్వామి అర్చకులు యామనార్యుల ఆదేశానుసారం శంఖు చక్రాలు కలిగిన భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని వెండితో తయారు చేయించి అక్కడే ప్రత్యేక ప్రదేశంలో ప్రతిష్టింప చేశారు. అప్పటికి కూడా మూలవిరాట్టు (ధ్రువబేరం)కు శంఖు చక్రాలు లేవు. ఇలా మరో కొన్ని దశాబ్దాలు గడిపోయింది.

యాదవరాజు సభలో ఏం జరిగింది? 

అయితే వెయ్యే శతాబ్దంలో ఈ అంశంపై అప్పట్లో తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్ద శైవులు మళ్ళీ తిరుమల పూజా విధానం, అక్కడున్న విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో శైవులకు, వైష్ణువులకు మధ్యన యాదవ రాజు చర్చ నిర్వహించారు. ఈ చర్చ కొన్ని రోజుల పాటు సాగింది. కొందరు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. అది విష్ణు రూపమేనని తన వాదన పటిమతో నిరూపించారు. పలు పురాణాలు, వాస్త్రాలను ఆధారాలుగా చూపి విష్ణువేనని రూఢి చేయించారు.

ఆ తరువాతే వేంకటేశ్వర స్వామికి బంగారుతో శంఖు చక్రాలు వచ్చాయి. మహిమగల స్వామి రామానుజచార్యుల విజ్నాపన మేరకు బంగారు శంఖు చక్రాలతో దర్శనమిచ్చాడని అంటుంటారు. కానీ, యాదవ రాజు ఎదుట చర్చ అనంతరం జరిగిన తీర్మానం ప్రకారం మున్ముందు ఈ వివాదానికి స్వస్తి పలికేందుకు బంగారంతో చేయించిన శంఖు చక్రాలను స్వామి విగ్రహానికి అమర్చారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత ఆలయ విస్తృతి బాగా జరిగింది. ఇదండి స్వామి వారి శంఖు చక్రాల చరిత్ర

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*