ఏక శిలపై శివకేశవులను ఎప్పుడైనా చూశారా?

హిందుత్వంలోనే శివుడిని, కేశవుడిని ఒకే ఆలయంలో ప్రతిష్టింప చేయడమే చాలా తక్కువ. మరి శివుడు,కేశవుడిని ఒకే శిలలోనా..? ఎక్కడ? ఎలా సాధ్యం? అనే సందేహం వెంటనే కలుగుతుంది. ఇది సాధ్యం కాదనే వారూ ఉంటారు. కానీ, ఇది నిజం. శివుడు, కేశవుడు ఒకే శిలలో దర్శనమిచ్చే దేవాలయం ఉంది. అదెక్కడో తెలుసుకోవాలంటే మనం ఈ వార్తను చదవాల్సిందే.

సాధారణంగా హిందుత్వంలో ముక్కోటి దేవతలు ఉన్నారని అంటారు. వారిని అనుసరించి భక్తులు ఏర్పచుకున్న తత్వాలు వేరుగా ఉన్నాయి. ఆ తత్వాలలో ఒకటి వైష్ణవం, రెండోది శైవం. విష్ణువును ఆరాధించే వారిని వైష్ణవులని, శివుడిని ఆరాధించేవారిని శైవులనీ అంటారు. ఇద్దరికీ ఆలయాలున్నా పూజా విధానాలే వేరు. వీరి మధ్య కొన్ని శతాబ్ధాల కిందటే వాదన, ప్రతివాదనలు జరిగేవి. అందుకే ఎక్కువగా శివాలయం ఉన్న చోట, విష్ణు ఆలయాలు ఉండవు. రెండు విగ్రహాలు ఒకే చోట ఉండడం చాలా తక్కువ. అసలు శివుడు లింగాకారంలో ఉంటాడు. విష్ణువు మూర్తిగా దర్శనమిస్తాడు.

దేశంలో పాత ఆలయాల్లో శివుడు చాలా తక్కువ చోట్ల మాత్రమే మూర్తి రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ ప్రాంతంలో కడప జిల్లా కమలాపురం మండలం సదిపిరాళ్ళ ఆలయంలోనూ, చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తొండవాడవద్ద శివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇది కూడా సహజమే అని అనుకుంటే, శివకేశవులను ఒకే శిలలో ఎప్పుడైనా చూశారా? లేదనే మాటే వినిపిస్తుంది. కానీ, తొండవాడ అగస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆలయంలో ఏక శిలపై శివకేశవులు కనిపిస్తారు. ఒకవైపు శివ రూపంలో గంభీరంగా దర్శనమిస్తే, మరోవైపు కేశవుడి రూపంలో ప్రశాంతంగా దర్శనమిస్తాడు.

సర్వముఖి నదీ గర్భాన ఉన్న త్రివేణీ సంగంలో నిర్మించిన ఈ ఆలయం అగస్తీశ్వర కాలం నాటిది. వేంకటేశ్వరుడు పద్మావతీ దేవిని పెళ్ళి చేసుకున్న తరువాత ఇక్కడే అగస్త్య ముని ఆశ్రమంలో ఉన్నారట. ఆ సమయంలో వేంకటేశ్వరుడు ఇక్కడే పూజలు చేశారట. ఇదే ఇతివృత్తంగా తొండమాన్ చక్రవర్తి ఏకశిలపై శివకేశవుల  విగ్రహాన్ని తయారు చేయించారని అంటారు. చారిత్రక ఆధారాలు పూర్తిగా లభ్యం కావడం లేదు. అయితే సుద్దతో చేసిన విగ్రహాన్ని కొన్నేళ్ళ కిందట రాతి రూపంలో ప్రతిష్టించారు.

ఈ విగ్రహంలోని అసలు మర్మమేమిటంటే… అప్పటికే శైవులు, వైష్ణవుల మధ్య ఒక రకంగా పోరాటం జరుగుతున్న సందర్భంలో శివుడైనా, కేశవుడైనా ఒకటే అనే సందేశాన్ని పంపడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కూడా తెలుస్తోంది.

గమనిక : దీనిని వీడియో రూపంలో చూడాలంటే వీడియో గ్యాలరీని తిలకించండి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*