తిరుమలలో శ్రీవారి సేవకులుగా పని చేయాలని ఉందా? ఎందుకు ఆలస్యం ?

తిరుమలలో శ్రీవారి సేవ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి అవకాశం వస్తే తప్పకుండా చేస్తారు. అక్కడ సేవ చేయడమనేది పూర్వ జన్మ సుకృతమని భావించే వారు చాలా మంది ఉంటారు.

కానీ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలనే అంశాలు చాలా మందికి తెలియవు. స్వామి సేవకులుగా పని చేయడానికి ఆసక్తి ఉండాలంతే…

ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. సిఫారస్సు అసలక్కర లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఆలయం మరియు తిరుమల పరిసరాల్లో శ్రీవారి సేవకులుగా ఉచిత సేవ చేయడానికి భక్తులకు అవకాశం కల్పిస్తోంది.

శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, స్థానిక ఆలయాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు శ్రీవారి సేవ కింద పలువురిని ఎంపిక చేస్తుంది.

అయితే సేవ చేయాలనుకునే వారు నెల రోజుల ముందే సమాచారమివ్వాలి. బృందాలుగా ఏర్పడి శ్రీవారి సేవకు రావచ్చు. లేదా ఒంటరిగానైనా సేవ చేయవచ్చు.

ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి.

గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.
ఏ కులంతో సంబంధం లేకుంగా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే. తప్పని సరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు అడిగిన అన్ని ఆధారాలను అప్ లోడ్ చేయాలి. అవసరాన్ని చూసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అవకాశం కల్పిస్తుంది.

హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి. శ్రీవారి సేవకు వచ్చే బృంద నాయకుడు లేదా సమన్వయకర్త సేవకు వచ్చేవారందరి వివరాలు ఇవ్వాలి.

వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి. ఆరోగ్యవంతులై ఉండాలి. అందుకు ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలి. అర్హత కలిగిన వైద్యుడి నుంచి దానిని పొందాలి.

శ్రీవారి సేవకు వచ్చే వారు ఎటువంటి నేరచరిత్ర కలిగి ఉండరాదు. భక్తులతో మర్యాదగా నడుచుకోగలిగే మనస్తత్వం కలిగి ఉండాలి.

కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి. సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు.

సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి. శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.

సేవా సమయంలోనే సులభంగా గుర్తించడానికి వీలుగా శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి. గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.

శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు.

సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.

వివరాలు పంపాల్సిన చిరునామా..!
పౌరసంబంధాల అధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.
మరిన్ని వివరాలకు 0877-2263544, 0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.

అలాగే ఆన్లైన్లోకి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. https://www.tirumala.org/ లోకి వెళ్ళి శ్రీవారి సేవను ఎంపిక చేసుకుని దరఖాస్తును సమర్పించాలి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*