కనుమ పండుగ మీరు కూడా ఇలా చేస్తారా? సీమ ప్రత్యేకం

కనుమ పండుగ మీరు కూడా ఇలా చేస్తారా

కనుమ అంటే పశువుల పండుగ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పాడిపంటలతో అలరారుతున్న రైతుకు ప్రధాన సహాయకారి పశుపక్ష్యాదులు.

అందుకే సంక్రాంతి పండుగ నాడు వాటికి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది.

తమ ఆరోగ్యాన్ని కాకుండా పశువుల ఆరోగ్యాన్ని కూడా రైతు చాలా జాగ్రత్తగా రక్షించుకున్నారు.

అందులో భాగమే కనుమ పండుగ.

మద్ది మాను, నేరేడు మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు మూలికలను సేకరించి కత్తితో చిన్న ముక్కలుగా చేస్తారు,

ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో దంచుతారు. దీన్ని “ఉప్పు చెక్క” అంటారు.

ఏడాదికి ఒకసారి ఉప్పుచెక్కను తినిపిస్తే పశువులకు సర్వరోగాలు పోతాయని భావిస్తారు.

ఇలా ఒక్కొక్క దానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తిపిస్తారు. గొర్రెలు, మేకలు ఔషధ మొక్కలు తినడం వల్ల వాటికి అవసరం ఉండదు .

పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయిస్తారు, .

ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా జీవిరి రంగులు పూస్తారు.

మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు, కొత్త పగ్గాలు అలంకరిస్తారు.

కనుమ రోజు కాటమ రాజే కింగ్

సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు.

పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం.

ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో, తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు.

కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని “చిట్లా కుప్ప” అంటారు.

చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు.

అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు, పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్ళను కోయించుకుంటారు.

అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు.

పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు.

పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి, చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి.

ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలొ వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు.

ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లాకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు.

పొలితో కొత్త మొక్కలు

ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడా బలిస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు.

దాన్ని ”పొలి”అంటారు. ఆ “పొలి”ని తోటకాపరి గాని, నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో “పొలో…. పొలి” అని అరుస్తూ చల్లుతాడు.

అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే, తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు.

అప్పటికప్పుడే ఒక పొటెలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది..

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*