తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -27

పాశురము-27

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్

తెలుగు అర్థం

గొపికలతో కలిసి ఆండాళ్ తల్లి అడిగిన వస్తువులన్ని అందరికి వినడానికి మామూలుగా కనిపించినా, అంతర్గతముగా వారు వస్తువులను కాకుండా తననే కోరి వచ్చారు అని శ్రీకృష్ణుడు గ్రహించెను. ఈ వస్తువులు మీకు ఇస్తే సరిపోతాయా, అని అడిగెను.

ఇవి స్నానమునకు ముందు కావలసినవి, స్నానము అయిన తరువాత ఇంకా కొన్ని కావాలి అని ఆండాళ్ తల్లి అన్నది.

ఆ మాటలు విని, అబ్బో, నేను మీ సర్వస్వాన్ని తీసుకోవాలి అని నేను అనుకుంటే, మీరే నా సర్వస్వాన్ని తీసుకొని, నన్నే జయించారే, అని శ్రీకృష్ణుడు అనగా, స్వామీ, నిన్ను తలవము, నిన్ను కొలవము అని అంటూ నీకు దూరముగా వుండి నిన్ను తిట్టేవారిని సులభముగా జయించి ఓడించగలవు.

కాని మేము నీ భక్తులము. నీవు తప్ప మాకు ఎవరు లేరు అని అనుకునే మమ్మల్ని, నీవు ఏ విధముగాను ఓడించలేవు.

గోవులను కాపాడే గోవిందుడా, నీ వేణుగానమును విని పరవశులమై, మేము గోవిందా, గోవిందా అని నిన్ను కీర్తించకుండా వుండలేక పోతున్నాము. నీ నామముతో మా నోరు తడిసి, సార్థకమైనది. రామావతారములో సీతమ్మవారి ద్వారా హనుమంతుడికి హారమును కానుకగా ఇచ్చి, సన్మానించినట్లుగా, ఈ లోకములోని వారందరూ మమ్మల్ని చూసి మెచ్చుకునేటట్లుగా, నీవు మా అమ్మ నీళాదేవి ఆ లక్ష్మీదేవి ద్వారా ముందుగా మమ్మల్ని సన్మానించు.

ఈ భూమి మీద కట్టుకోవడానికి పట్టుచీరలు, చేతికి గాజులు, భుజములకు వంకీలు, చెవులకు దుద్దులు, మాటీలు, తలకు చేమంతి బిళ్ల, కాళ్లకు పట్టీలు ఇవన్నీ ఇప్పించి, స్నానము అయిన తరువాత మేము అలంకరించుకోవడానికి కావలసిన అన్నిట్ని మా అమ్మ నీళాదేవితో ఇప్పించు.

మేము కొత్త బట్టలు కట్టుకొని, ఆభరణములతో అలంకరించుకొని వచ్చిన తరువాత, నెయ్యి చేతిలో నుంచి మోచేతిలో వరకూ కారుతూ వుండే పాయసాన్నమును, నీతో కలిసి హాయిగా ఆనందముగా తినే భాగ్యమును ప్రసాదించు స్వామి, అని ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి భగవంతుడిని ప్రార్థించినది. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*