తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు.

ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు.

పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగారు పూలచెండ్లతో వేటకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడించారు.

స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు.

అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు.

ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్‌ రచించిన ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలోని పాసురాలను నింద – స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆలయంలో వసంతోత్సవాన్ని తితిదే రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, పేష్కార్ శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*