తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14వ తేదీన మంగళవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
జనవరి 15న మకర సంక్రాంతి
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి కావడంతో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5.30 గంటలకు సంక్రాంతి తిరుమంజనం చేపడతారు.
ఉదయం 7 గంటలకు శ్రీ చక్రత్తాళ్వార్‌ను కపిలతీర్థం వద్దగల ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహిస్తారు.
సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి ఆస్థానం చేపడతారు.
జనవరి 16న గోదా పరిణయోత్సవం, శ్రీ కూరత్తాళ్వార్ శాత్తుమొర
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 16వ తేదీన గోదా పరిణయోత్సవం, శ్రీ కూరత్తాళ్వార్ శాత్తుమొర జరుగనున్నాయి.
ఉదయం 5 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి మేల్‌ఛాట్ వస్త్రం, పూలమాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మవారికి సమర్పిస్తారు.
అనంతరం ఆండాళ్ అమ్మవారికి శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలో ఆస్థానం చేపడతారు. అక్కడినుండి ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళతారు.
కపిలతీర్థం నుండి పిఆర్ తోట మీదుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు. శ్రీ కూరత్తాళ్వార్ శాత్తుమొర సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీ కూరత్తాళ్వార్ సన్నిధికి వేంచేపు చేస్తారు.
అక్కడ సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం చేపడతారు.
జనవరి 17న పార్వేట ఉత్సవం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17న పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 నుండి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మవారిని మాడ వీధుల గుండా ఊరేగింపుగా రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు.
అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
Leave a Reply