తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -26

పాశురము-26

మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదామే
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.

తెలుగు అర్థం

మాలే, మణివణ్ణా/, గాజుపాత్రలోని దీపమువలె, నీ శరీరపు నీలరత్నమణిమయ ప్రకాశము వలన, నీ పెదవులపైన వున్న చిరునవ్వు వలన, నీ హృదయములో మా మీద నీకు వున్న అభిమానము, ఎంతవుందో మాకు తెలుస్తోంది.

భక్తుల మీద నీకు వున్న అభిమానమును తెలుసుకొని, నీవు తప్పక దర్శనము ఇస్తావనే నమ్మకముతో నీ భువన మోహన దివ్య మంగళ విగ్రహ సౌందర్యమును చూడాలనే ఆశతో ఇన్ని లక్షలమందిమి నీ దివ్య సన్నిధికి వచ్చాము.

భక్తి జ్ఞాన వైరాగ్యములతో నిండి, ఆ భగవంతుడి యొక్క అనుభవములో ఆనందముగా మునిగి తేలుటయే ఈ మార్గళి స్నానము అని మా పెద్దలు మాకు చెప్పారు.

ఏ వరములను, కోరికలను కోరకుండా నిన్నే చేరాలి అనే ఆశతో మా పెద్దలు చేసిన ఈ వ్రతమునే మేము కూడా ఆచరించాము. పర అనే మోక్షమును ఇచ్చు దేవుడివి నీవే, అని మా పెద్దలు చెప్పగా, నిన్ను నమ్మి వచ్చాము.

మా వ్రతమునకు కావలసిన వస్తువులను మేము అడుగుతున్నాము. నీ పాంచజన్య శంఖము వలె ఈ భూమి అంతా దద్దరిల్లేటట్లు పెద్ద శబ్దము చేసే పాలనురుగు వంటి తెల్లని శంఖము కావాలి.

ఎందుకంటే యమునానదికి స్నానానికి వెళ్లే ముందు, మంగళకరమైన ఈ శంఖధ్వని వుంటే మా వ్రతమునకు చాలా మంచిది.

చీకటిలో యమునానదికి వెడతాము కాబట్టి, నీ సుదర్శనచక్రపు కాంతి కలిగిన మంచి దీపపు కాంతి కావలెను. అదే విధముగా నీకు, నీ భక్తులకు ఎటువంటి కీడు కలగకూడదు అని అంటూ, వేదమంత్రములు చదివే భాగవతోత్తములు

మరియు మంగళవాయిద్యములు కావలెను, మేమంతా కలిసి ఒకే చోట వ్రతము చేస్తున్నాము కాబట్టి అందరికీ ఆ ప్రదేశము తెలిసేటట్లు ఒక జెండా కావలెను. అక్కడ మంచుపడకుండా చాందినీ అనే గొడుగు కావలెను, అని అడిగిరి.

ఇన్ని వస్తువులు ఇవ్వడము చాలా కష్టము అని శ్రీకృష్ణుడు అనగా, చిన్ని పొట్టలో పదునాలుగు లోకములను పెట్టుకొని, చిన్న మర్రి ఆకుపై పవళించిన నీకు కష్టము, అసాధ్యము అన్నది ఉంటుందా స్వామీ.

నీ దయ వుంటే, నీవు తలచుకుంటే, అసాధ్యము అంటూ ఏది లేదు. మమ్మల్ని రక్షించాలి అని నీవు అనుకుంటే, ఈ వస్తులన్నిటిని మాకు ఇప్పించు స్వామి అని ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*