పాశురము-25
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలా నాగిత్తాన్ తీఙ్గునినైన్ద
కరుత్తైప్పిళ్ళైకఞ్జన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాగిల్
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్.
తెలుగు అర్థం
ప్రకాశించు శంఖుచక్రాదులతో సర్వేశ్వరుడు అవతరించిన రాత్రి, చెరసాలలో చీకటిలో మగ్గుతున్న తల్లిదండ్రులను విముక్తులను చేసే రాత్రి, యమునానది దారి ఇచ్చిన రాత్రి, కంసుడి చావుకు మూలమైన రాత్రి,
ఆ సమయమున దేవుడే నాకు కొడుకుగా పుట్టాలి అని అనుకున్న దేవకేదేవికి కుమారుడివై పుట్టి, ఒక్కరాత్రి కూడా అక్కడ వుండక,
అదేరోజు రాత్రి యశోదాదేవికి కొడుకువై పెరిగిన నల్లనివాడా, ఒకరి కడుపున పుణ్యఫలముగా, ఇంకొకరి ఇంట నోముఫలముగా గారాల అల్లరి కృష్ణయ్యగా జన్మించినావు.
సర్వ లోకములకు, సర్వ భూతములకు తల్లి, తండ్రి అన్నీ తానే అయివున్నవాడు నాకు కొడుకుగా పుట్టాడు, నేను ధన్యురాలిని అని మురిసినది దేవకీదేవి.
సమస్త జీవరాశులను తన కనుసన్నలలో నిలుపుకొని, రక్షించి, శిక్షించే పరమాత్మను అదిలించి, బెదిరించి చేతికి కర్రను, చద్దిమూటను ఇచ్చి, ఆవుల వెంట అడవికి పంపిన యశోదాదేవి, సాయంత్రము ఆవుల వెంట తిరిగి వస్తున్న
నీ అందచందములను, నీ లీలలను చూసి, మురిసిపోతూ, నా అంత భాగ్యవంతురాలు ఈ లోకములోనే లేదు అని పరవశించినది ఆ యశోదాదేవి.
దేవకీదేవి కడుపు పంటగా, యశోదాదేవి కంటి పాపగా పెరిగిన నా స్వామీ, దానికి కారణము నీ ఆశ్రితవ్యామోహమే కదయ్యా.
భక్తులందరూ నిన్ను చూసి ఆనందించాలి అని అనుకుంటే, నీవేమో దాగి దాగి పెరిగావు. నిన్ను చంపాలని ప్రయత్నించిన దుష్టబుద్ది గల ఆ కంసుడి దగ్గరకు నీవే వెళ్లి చంపావు.
స్వామీ, ఎన్నిరోజుల నుంచో నీ విరహ వేదన వలన కలిగిన బాధ, నిన్ను చేరాలి అని పడిన శ్రమ అంతా, నీ దర్శన భాగ్యము వలన క్షణకాలములో మటుమాయమయ్యి మా శరీరము, మనస్సు దూదిపింజము వలె తేలిక అయ్యి, ఆనందపరవశముతో పులకరించి పోతున్నది.
లోకములోని అందరూ లక్ష్మీదేవిని పొందాలి అని అంకుంటే, ఆ మహాలక్ష్మి మాత్రమూ నిన్నే పొందాలి అని అనుకున్నది. అంత గొప్ప భాగ్యము కలిగిన నీ ఆశ్రిత వాత్సల్య కళ్యాణగుణముల వలన ఇంతదూరము నీ వద్దకు రాగలిగాము.
నీవు మా గురించి ప్రత్యేకముగా మళ్లీ జన్మించక్కరలేదు. ఎవరినీ చంపవలసిన పని లేదు. నీ దివ్య మంగళ విగ్రహము యొక్క సేవాభాగ్యమును కలగచేసి, పర అను వ్రత సాధనమును మాకు ఇచ్చినచో, మేము దానిని తీసుకొని ఆనందించెదము, అని గోపికలతో కలిసి ఆండాళ్ తల్లి అడిగెను.
ఇదియే ఇందులోని అభిప్రాయము.
Leave a Reply