తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -24

పాశురము-24

అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి
చ్చెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోట్రి
పొన్రచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి
కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి
కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్.

తెలుగు అర్థం

గోపికలతో కలిసి ఆండాళ్ తల్లి కోటిమన్మథాకారుడైన ఆ సర్వేశ్వరుడి యొక్క జగన్మోహన రూపమును చూడగానే వారు మైమరిచి పోయిరి.

ఎదురుగా ఆ స్వామి యొక్క దివ్య మంగళ స్వరూప సౌందర్యము తొణికిసలాడుతూ కనిపించే సరికి, ఆనంద పరవశులై వారు వచ్చిన పనిని మరిచిపోయిరి.

భక్తి భావము ఎక్కువ అయి, అయ్యో, స్వామీ, ఇంత సుకుమార సుందర దివ్య పాదములతో నిన్ను నడిచి రమ్మన్నామే, నీ కాళ్లు ఎంత కందిపోయాయో.

వామనావతార సమయమున మూడు అడుగులలోని ఒక అడుగుతో ఈ భూమిని కొలవడము వలన ఈ భూమిపై వున్న చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు అన్నీ నీ పాదమునకు గుచ్చుకొని, అప్పుడు ఇంకెంత కందిపోయాయో.

అందుకే వామనావతారమున ఈ లోకములన్నిటిని కొలిచిన నీ దివ్య పాదములకు రక్ష కావలెను. అందుకే నీ దివ్య పాదములకు మంగళము. రాముడివై లంకకు వెళ్లి, రావణుడితో పాటు రాక్షస జాతిని చంపిన నీ భుజశక్తి జాగ్రత్తగా వుండవలెను.

అందుకే నీ విశాల భుజములకు మంగళము. చిన్ని కృష్ణుడివై శకటాసురుడిని తన్ని, చంపిన నీ దివ్య పాదములకు మంగళము.

దూడరూపమున వచ్చిన వత్సాసురుడను రాక్షసుడి నాలుగు కాళ్లు పట్టుకొని, వెలగపండు రూపములో వున్న కపిత్తాసురుడను రాక్షసుడి మీదకు విసిరి, ఇద్దరిని ఒకేసారి చంపినప్పుడు, నీ శక్తినంతా కూడగట్టుకొని, భూమిపై అదిమిపెట్టి నిలుచున్న నీ దివ్య పాదములకు మంగళము.

గోవర్థనగిరిని నీ చిటికెన వ్రేలిపై గొడుగుగా ఎత్తిపట్టి, గోకులమును కాపాడిన నీ కళ్యాణగుణములకు మంగళము.
అమ్మో, ఇన్నిసార్లు ఆ స్వామికి మంగళము చెబుతున్నాము. ఇంకేమైన వుందా, మన దిష్టే మళ్లీ ఆ స్వామికి తగులుతుంది.

అందుకే స్వామీ, నీ విజయానికి సహాయపడే నీ చేతిలోని బల్లెము, ఆ వేలాయుధమునకు మంగళము. స్వామీ, ఇన్నిసార్లు నీకు మంగళము చెబుతున్నామని అనుకోకు.

మా కోరిక తీరిన తరువాత కూడ మేము ఈ విధముగానే నీకు మంగళము పాడెదము. ఇది మా బాధ్యత. నిన్ను కీర్తించి, నీవు ఇచ్చు వాయిద్య విశేష రూప పూరుషార్థమును తీసుకొనుటకై మేము నీ సన్నిధికి వచ్చాము.

మమ్మల్ని అనుగ్రహించు స్వామి,అని ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*