టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పడం, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.
సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద శ్రీవారి ప్రచారరథంలోని స్వామివారికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుండి 3 వేల మంది భజనమండళ్ల సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్నారని తెలిపారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి భజనలు, కోలాటాలతో శోభాయాత్ర రైల్వేస్టేషన్ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకుంటుందన్నారు.
జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తామన్నారు.
అక్కడినుంచి భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ శ్రీమతి వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
Leave a Reply