తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -22

పాశురము-22

అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.

తెలుగు అర్థం

ప్రకృతి రమణీయతతో నిండి, చాలా విశాలముగా వున్న, ఈ గొప్ప భూమండలము నందు వున్న పెద్ద పెద్ద రాజులు మేమే గొప్పవారము అను అహంకారమును, అహంభావమును విడిచిపెట్టి, నీ దయాదాక్షిణ్యములకై వచ్చి, నీ సిం హాసనము చుట్టూ చేరి వుండగా, వారిని నీవు అనుగ్రహించావే.

అందుకే మేము కూడా వారి వలె నీ సన్నిధికి వచ్చి వున్నాము. సూర్య కిరణములు సోకగానే మెల్లమెల్లగా వికసించే తామరపువ్వుల వలె, సుందరములైన నీ కళ్లు మెల్ల మెల్లగా తెరచుకొని, మమ్మల్ని ఆనందింపచెయ్యి స్వామి.

ఒక చిరు గంటలాగా, విచ్చిన తామర పువ్వులాగా,ముద్దులొలుకు నీ సోగకన్నులను అరమోడ్పుగా విప్పి, మాపై అనుగ్రహముతో ప్రేమగా దయ చూడు స్వామి.

నీ వికసిత నయన కమలములతో ఒక్కసారి మమ్మల్ని చూడు స్వామి. సూర్య చంద్రులు ఒక్కసారే ఆకాశములో ఉదయించినట్లుగా ఉండే నీ రెండు దివ్య నేత్రములతో ఒక్కసారి మావైపు చూసి కటాక్షించు స్వామి.

నీ దివ్య కరుణా కటాక్షములతో మా పూర్వ జన్మ పాపకర్మలు అన్నీ పటాపంచలు అయిపోయేటట్లుగా నీ చల్లని చూపులతో మమ్మల్ని చూడు స్వామి, అని ఆండాళ్ తల్లి గోపికలో కలిసి ప్రార్థిస్తూ, మేల్కొలుపుతున్నారు.

ఇదియే ఇందులోని అభిప్రాయము

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*