తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -17

పాశురము-17

అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్!
అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద
ఉమ్బర్ కోమానే ! ఉఱజ్ఞ్గాదెళున్దిరాయ్
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్.

తెలుగు అర్థం
అందరికి లేదు అనకుండా, సమృద్దిగా అన్నమును, వస్త్రములను దానము చేయు నందగోపాలా, లేవండి. మీరు ఇచ్చు దానమును గ్రహించుటకు, మాకు మేమే ఎవరూ పిలవకుండా మీ ఇంటికి వచ్చాము.

దానము తీసుకునేవారు వుంటేనే కదా, ఇచ్చే దాతకు పేరు వచ్చేది. మాకు అన్నీ తానే అయివున్న మీ కృష్ణుడిని మాకు చూపి, మా విరహ వేదన అనే దాహాన్ని తీర్చండి అని ఆ నందగోపాలుడిని మేల్కొలిపెను.

ఆ నందుడి అనుమతితో యశోదా దేవిని లేపుతున్నారు. భగవంతుడిని కొడుకుగా కన్న మంగళ మణి దీపమా, స్త్రీలోకమునకే తలమాణిక్యమైన కులదీపమా, నీవు నిద్ర నుంచి లేచి రావమ్మా.

చిగురు వంటి యశోదా, నీ మనస్సు చాలా సున్నితము. ఎవరైనా బాధపడితే నీ ముఖము లేతచిగురు వలె వాడిపోవును. స్త్రీల కష్టసుఖములు స్త్రీలకే తెలుస్తాయి. ఆకాశమంత ఎత్తు ఎదిగి, మూడు అడుగులతో ముల్లోకములను కొలిచిన ఆ త్రివిక్రముడి కళ్యాణగుణములే మాకు జీవనాధారము.

మా మనస్సు ఆ స్వామి దర్శనమునకై పరితపిస్తున్నది. మా బాధను అర్థము చేసుకొని, నీవు నిద్ర నుంచి లేచి, ఆ స్వామి మంగళకర సౌందర్య రూప దర్శనమును మాకు ప్రసాదించు అని యశోదా దేవిని మేల్కొలిపెను.

బంగారు కడియమును నీ దివ్య పాదమునకు ధరించిన బలదేవా, ఆదిశేషుడి అవతారమా, రామావతారమున లక్ష్మణుడిగా, కృష్ణావతారమున బలరాముడిగా స్వామిని క్షణమైనను విడువకుండా సేవించుచున్నావు.

స్వామి వద్ద కలిగే మధురానుభూతిని అనుభవించిన నిన్ను అతి దీనముగా అర్థిస్తున్నాము. నీవు నిద్ర లేచి, మమ్మల్ని శ్రీకృష్ణుడితో చేర్చుటకు సహాయపడు అని ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి బలరాముడిని మేల్కొలిపెను. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*