తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాల నిర్వహణకు మెరుగ్గా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను గురువారం సాయంత్రం ఈవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతేడాది తరహాలోనే మాడ వీధుల్లో 40 వేల మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశామన్నారు.
నారాయణగిరి ఉద్యానవనాల్లో రూ.26 కోట్లతో నిర్మించిన షెడ్లలో 30 వేల మంది భక్తులు కూర్చునేందుకు వీలుందన్నారు.
జనవరి 5వ తేదీ అర్ధరాత్రి నుండి వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోకి 15 వేల మంది భక్తులను అనుమతిస్తామన్నారు.
మొత్తం కలిపి 85 వేల మందికి పైగా భక్తులు చలికి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి నాడు ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 2.30 గంటల నుండి విఐపిలకు దర్శనం ప్రారంభమవుతుందని, సామాన్య భక్తులను ఉదయం 5 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తామని ఈవో వివరించారు.
విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని చెప్పారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులు దర్శనం చేసుకున్న అనంతరం మాడ వీధుల్లోని భక్తులను కంపార్ట్మెంట్లలోకి అనుమతిస్తామన్నారు.
క్యూలైన్లలో అన్నప్రసాదాలు, తాగునీటి పంపిణీకి సుమారు 3500 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తారని ఈవో తెలిపారు.
వీరితోపాటు 1300 మంది స్కౌట్స్, 1100 మంది టిటిడి నిఘా మరియు భద్రతా సిబ్బంది, 1900 మంది పోలీసులు విధి నిర్వహణలో ఉంటారని వెల్లడించారు.
టిటిడి భద్రతా విభాగం, పోలీసులు సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారని, వీరికి సిసిటివి సిబ్బంది, మొబైల్ బృందం సహకరిస్తారని తెలిపారు.
ముందుగా మాడ వీధుల్లోని షెడ్లు, నారాయణగిరి ఉద్యానవనాలు, బయటి క్యూలైన్లను ఈవో తనిఖీ చేశారు.
ఈవో వెంట టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply