తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -9

పాశురము- 9

తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్

తెలుగు అర్థం 
మామగారి కూతురు ఓ మరదలా, తెల్లవారిపోయినా, నీవు ఇంకా నిద్ర లేవకుంటివి. నీవు మణిమాణిక్యములతో నిర్మించిన చాలా అందమైన పెద్ద మేడ యందు, చుట్టూ ప్రకాశించు దీపములు

వెలుగుచుండగా, మంచి సువాసనల అగరు ధూపములు పరిమళించుచుండగా, సుతిమెత్తటి పానుపుపై మంచి నిద్రావస్థలో వున్నావా, లేచి రావమ్మా. మణిమాణిక్యపూరితమైన మీ ఇంటి తలుపు గడియను తీయుము.

నీవు ఈ బాహ్యప్రపంచమున సుఖసంపదలు అన్నిటిని అనుభవిస్తున్నావు. కాని ఈ భోగభాగ్యములే ఎప్పటికి మన జీవిత పరమావధి కాదు. దీనితో పాటు ఈ జన్మకు కారణమైన శాశ్వతసుఖమును తెలుసుకో.

ఈ బాహ్య సుఖము అను మాయా నిద్ర నుండి లేచి శాశ్వత సుఖములను ఒసగు భగవంతుడిని కీర్తించుటకు లేచి రా. మేము చెబుతున్న ఈ భగవంతుడి విషయములు, భగవన్నామ సంకీర్తనములు నీకు వినబడుట లేదా.

ఓ అత్తగారూ, మీ కూతురిని నిద్ర లేపండి. ఏమిటి, సమాధానము చెప్పకున్నది. నీ కూతురు మూగదా లేక మా మాటలు వినపడని చెమిటిదా లేక అలసిపోయి వున్నదా లేక మీరు బయటకు పంపకుండా కట్టుదిట్టములు చేసి కాపలా కాస్తున్నారా లేక బద్దకమా.

చాలా సేపు నిద్ర పోవడానికి ఏమైనా మందు ఇచ్చారా లేక మంత్రము వేశారా. ఏమైనా మంత్రము వేసినచో, ఆ భగవంతుడి దివ్యనామములను కీర్తిస్తే ఆ మంత్రశక్తి నశిస్తుంది.

ఆశ్చర్యకరమైన గుణములు కలిగిన శ్రియఃపతి ఆ వైకుంఠనాథుడి దివ్యనామములను మేము చక్కగా కీర్తించాము. మా బద్దకము అంతా పోయినది. ఇకనైనా ఆమెను నిద్ర లేపి, మాతో పాటు మా వ్రతమునకు పంపుము,

అని ఆండాళ్ తల్లి సమాజములోని సంబంధ బాంధవ్యాల అమరికలో వున్న ఐక్యత వలన కలిగిన సిరిసంపదలను చూపుతూ, మనలోని బద్దకము అను నాలుగవ గోపికను మేల్కొలిపెను. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*