గోవిందా…! గోవిందా…!! 25 ఎకరాల భూమి ‘టాటా’ర్పణం… ఎక్కడ?

ఏ ప్రభుత్వం వచ్చినా…. ఏ నాయకుడు వచ్చిన టీటీడీ మాత్రం నిత్యం వివాదాలలో కూరుకుపోతూనే ఉంది. వేల కోట్ల ఆస్తి.. వేల ఎకరాల భూమి. గద్దల్లా తన్నుకు పోవడానికి రకరకాల సంస్థలు తిరుపతిలో వాలిపోతున్నాయి.

ఆ నాయకులు నియమించే పాలకమండలి పెద్దల ఇష్టానుసారం టీటీడీ సొత్తు పరాయపాలవుతోంది. అందుకు ఏదో ఒక వంకలు పెట్టుకుని పని కానించేస్తున్నారు.

తాజాగా జరిగిన పాలక మండలి సమావేశమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 520 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని టాటా సంస్థలకు లీజు పేరుతో అప్పనంగా కట్టబెట్టిన ఘనమైన చరిత్ర ఈ పాలక మండలిది.

గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలను వెలికితీస్తామని నేటి ప్రభుత్వం అంటుంటే, అదే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలకమండలి టీటీడీ భూమిని చివరకు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా లేకుండా సహకరించి తమ ‘టాటా’ భక్తిని చాటుకుంది.

తిరుపతి సమీపంలోని అలిపిరి జూ పార్క్ రోడ్‌లో టాటా క్యాన్సర్ హాస్పిటల్‌కు 25 ఎకరాల టిటిడి స్థలాన్ని 33 సంవత్సరాల నామినల్ లీజుకు గత ప్రభుత్వంలో మంజూరు చేశారు.

ఆ స్థలం విలువ ఎంతో తెలుసా… అక్షరాలా రూ.520 కోట్లు. దాని రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతో తెలుసా…! అక్షరాలా రూ. 15కోట్లా 60 లక్షలా 90 వేల రూపాయలు. ఇది టాటా సంస్థ టీటీడీతో ఎంఓయు కుదుర్చుకుంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం.

అయితే దీనిని కూడా కట్టడానికి టాటా సంస్థ డబ్బులు లేవన్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పెద్దలు దేశంలో పేరు మోసిన ‘టాటా’ల పట్లనే ఉదాసీనతను ప్రదర్శించారు.

మరో మూడేళ్ళ లీజు సమయాన్ని తగ్గించేస్తే ఆ సొమ్ము(అంటే రూ. 15.69 కోట్లు ) చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇంకెందుకు ఆలస్యం ఉన్నది మన చేతిల్లోనే కదా అన్నట్లు ఆ అంశాన్ని పదవ అంశంగా టీటీడీ పెద్దలు ఆమోదం తెలిపేశారు.

ఇంకేముంది 25 ఎకరాల భూమి టాటాల చేతికి. రూ.15.69 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండిపడింది. టీటీడీ తలుచుకుంటే అదే కాన్సర్ ఆసుపత్రి పెట్టలేదా…? 30 యేళ్ళ తరువాత రాజు ఎవరో… మంత్రి ఎవరో… ఆ భూమి తిరిగి టీటీడీ వస్తుందా? గోవిందా… గోవిందా..

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*