తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -5

పాశురము-5

మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్

తెలుగు అర్థం

ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ, చిద్విలాసముగా చిరునవ్వులు చిందిస్తూ, భగవత్ సంబంధము కలిగిన ఉత్తర మథురకు రాజై వెలుగుతున్న ఆ శ్రీకృష్ణుడిని, నిండు నీటితో ప్రవహించే పవిత్రమైన యమునానదీ తీరమున విహరించే వాడిని,

గోపకులము నందు ప్రకాశించే మంగళకరమైన మణిదీపము ఆ గోపకిశోరుడిని, తల్లి యశోదాదేవిని భక్తి పారవశ్యములో మైమరపించిన ఆ దామోదరుడిని, మన పవిత్రమైన మనస్సుతో కీర్తిస్తూ,

శ్రీ మహా విష్ణువుకు చాలా చాలా ఇష్టమైన భక్తితో కూడుకున్న పువ్వులను అనగా అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వ భూత దయ, క్షమ, జ్ఞానము, తపస్సు,

సత్యము, ధ్యానము అనే పుష్పములను మనము నిండుగా సమర్పిస్తూ, మన శరీర ఇంద్రియములు అన్నింటితోనూ సాష్టాంగ నమస్కారములు చేస్తూ, మన మనస్సులో ఎల్లవేళలా ధ్యానిస్తూ,

మన నోటితో ఓ మాయాలోలుడా, ఓ మథురా నాయకా, ఓ యమునా తీర విహారీ, ఓ నంద వ్రజ మంగళ దీపమా, ఓ యశోదా గర్భ ప్రకాశమా, ఓ దామోదరా అని అంటూ ఆ స్వామి దివ్య నామము లను కీర్తించ గలిగితే చాలును.

మనము ముందు చేసిన పాపములు, తరువాత రాబోయే పాపములు అన్నీకూడా , అగ్నిలో పడిన దూది వలె, కాలిపోయి, నాశనమై పోతాయి. అందుకే ఆ భగవన్నామ సంకీర్తనలతో మన పాపములు పోగొట్టుకోడానికి, ఈ వ్రతమును చేద్దాము రండి,

అని అప్పుడు గోపికలను, ఇప్పుడు మనందరిని గోదాదేవి పిలుస్తూ, మనము చెయ్యాలి అని అనుకునే పనికి ఏమేమి కావాలో మనకు ముందుగా తెలిసి ఉండాలి అని ఆండాళ్ తల్లి, ఇందులోని అభిప్రాయముగా చెబుతున్నది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*