తిరుమలలో జలహారతి : 544 రోజుల‌కు సరిపడా నీరు

కుమార‌ధార, ప‌సుపుధార జ‌లాశ‌యాల్లో ఘ‌నంగా గంగ‌పూజ‌

కల్యాణి డ్యామ్‌ నీటితో కలుపుకుంటే తిరుమలలోని జ‌లాశ‌యాల్లో 544 రోజుల‌కు గాను భక్తులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.

తిరుమలలోని కుమార‌ధార, ప‌సుపుధార జ‌లాశ‌యాల్లో శుక్ర‌వారం గంగపూజ నిర్వహించారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో క‌లిసి ఈవో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండినపుడు గంగపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులతో మే 14 నుండి 18వ తేదీ వ‌ర‌కు తిరుమలలో కారీరిష్టి యాగం, అమృత‌వ‌ర్షిణి రాగాలాప‌న‌, తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో వరుణజపం నిర్వ‌హించామ‌ని తెలిపారు.

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ఈ సంవ‌త్స‌రం విస్తారంగా వ‌ర్షాలు కురిశాయ‌న్నారు. త‌ద్వారా తిరుమ‌ల‌లోని కుమారధార‌, ప‌సుపుధార, ఆకాశ‌గంగ జ‌లాశ‌యాల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ‌లు ఉన్నాయ‌న్నారు.

పాప‌వినాశ‌నం జ‌లాశ‌యం సామ‌ర్థ్యం 5,240 ల‌క్ష‌ల గ్యాల‌న్లు కాగా, ప్ర‌స్తుతం 3,730 ల‌క్ష‌ల గ్యాల‌న్ల(71.18 శాతం) నీరు నిల్వ ఉంద‌ని తెలిపారు. అదేవిధంగా, గోగ‌ర్భం జ‌లాశ‌యం సామ‌ర్థ్యం 2,833 ల‌క్ష‌ల గ్యాల‌న్లు కాగా, ప్ర‌స్తుతం 1,848 ల‌క్ష‌ల గ్యాల‌న్ల(65.23 శాతం) నీరు నిల్వ ఉంద‌ని చెప్పారు.

తిరుప‌తిలోని క‌ల్యాణి డ్యామ్‌లో 31.12 శాతం నీరు నిల్వ ఉంద‌ని వివ‌రించారు. ఇంకా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున నీటి నిల్వ‌లు ఇంకా పెరుగుతాయ‌న్నారు.

వీటితో పాటు తిరుమ‌ల‌కు శాశ్వ‌తంగా నీటి అవ‌స‌రాలు తీర్చేందుకు బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నీటిని వినియోగించుకోవాల‌ని టిటిడి బోర్డు తీర్మానించింద‌ని తెలిపారు.

అంతకుముందు తిరుమలలోని కుమార‌ధార, ప‌సుపుధార జ‌లాశ‌యాల్లో గంగపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపుకుంకుమ, చీర, సారె, పూలు, పండ్లను నీటిలో వదిలి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*