
తిరుచానూరు పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథినఆదివారం పంచమీ తీర్థం అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు.
తిరుమల నుంచి వచ్చిన సారెను పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒక కిలో 300 గ్రాములు బరువుగల వజ్రాలు పొదిగిన అష్టలక్ష్మీ స్వర్ణ వడ్డాణాన్నిసారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
శోభాయమానంగా స్నపనతిరుమంజనం
పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి.
ఎండు ద్రాక్ష, కొబ్బరి పూలు, ఎండుఫలాలు, పవిత్రాలతో మాలలు రూపొందించారు. తులసి గింజలు, పవిత్రాలతో చేసిన మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మధ్యాహ్నం 12.15 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది.
చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు.
Leave a Reply