పంచమితీర్థంనాడు విశేష సంఖ్యలో భక్తుల పవిత్రస్నానం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి.
చివరిరోజు ఆలయం వద్ద గల పద్మ పుష్కరిణిలో జరిగిన చక్రస్నానం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి పవిత్రస్నానాలు ఆచరించారు.
ఇంచుమించు ఒకటిన్నర లక్షల మంది జనం తిరుచానూరు క్యూ కట్టారు.
అలిమేలు మంగమ్మ వారి చక్రతల్వార్ ను పుష్కరిణిలో మునక వేసే సమయంలో పుణ్య స్నానమాచరిస్తే సర్వ పాపాలు పోతాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం.
ఇందులో భాగంగా తిరుపతి నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి భక్తజనం తిరుచానూరు పోటెత్తింది.
ఒకవైపున జడివాన కురుస్తున్నా కూడా ఏమాత్రం లెక్కచేయకుండా భక్తజనం ఉదయం నుంచే పుష్కరిణిలో పంచమితీర్థం స్నానం కోసం వేచి ఉన్నారు.
ఎముకలు కొరికే చలి నీళ్లలో కనిపిస్తున్న అచంచల భక్తితో వీరు గంటల పాటు నీటిలోనే వేచి ఉండడం విశేషం.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
పంచమితీర్థానికి విచ్చేసిన భక్తులకు టిటిడి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరువేరుగా గేట్లను ఏర్పాటుచేశారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. కాలినడకన వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా తిరుచానూరు బయటి నుంచే వాహనాలను దారి మళ్లించారు.
తిరుపతి నుంచి వచ్చే వాహనాలకు, పాడిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టారు.
టిటిడి భద్రతా సిబ్బంది 350 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్.సి.సి విద్యార్థులు 200, శ్రీవారి సేవకులు 200, పోలీస్ సిబ్బంది 1600 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విశేష సేవలు అందించారు.
ఆలయంలోని క్యూలైన్లు, వాహనసేవల్లో, అన్నప్రసాద భవనంలో భక్తులకు సేవలందించారు.
మొత్తం 500 మంది శ్రీవారిసేవకులు, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలు అందించారు.
పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు శిల్పారామం, తనపల్లి క్రాస్, మార్కెట్‌యార్డు, రామానాయుడు కల్యాణ మండపం, పూడి జంక్షన్, తిరుచానూరు బైపాస్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ప్రముఖులకు ఆర్కె కల్యాణమండపం ఎదురుగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
Leave a Reply