అలమేలుమంగమ్మకు ఆరగింపులేంటి?

తిరుమల శ్రీవారి దేవేరి అలమేలు మంగ రోజు ఏమీ ఆరగిస్తారు.? సేవల సమయంలో నైవేద్యంగా పెట్టే ప్రత్యేక ప్రసాదాలు ఏంటీ?

ఆలయంలో ఉదయం 6.30 గంటలకు మొదటి గంట వేళలో మాత్ర, సీర, పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దధ్యోధనం సమర్పిస్తారు.

ఉదయం 8 గంటలకు(మంగళ, బుధ, ఆదివారాల్లో 9.30 గంటలకు) రెండో గంట సమయంలో లడ్డూ, వడ, పులిహోర, దధ్యోధనం, చక్కెరపొంగళి నివేదిస్తారు.

కల్యాణోత్సవం సమయంలో చక్కెర పొంగలి, పులిహోర, అప్పం ప్రసాదంగా అందిస్తారు.

సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఊంజల్‌సేవలో సుండల్‌, రాత్రి 7 గంటలకు రాత్రి గంట వేళలో మల్‌హోర, చక్కర పొంగలి, పులిహోర, దధ్యోధనం సమర్పిస్తారు.

వారపు సేవలైన గురువారం తిరుప్పావడ సేవనాడు 70 కిలోల పులిహోర, జిలేబి, మురుకు, దోశ, అప్పం, శనగలు, కదంబం, పెసరపప్పు, పానకం, శుక్రవారం అభిషేకం సందర్భంగా కదంబం, దోశ, పులిహోర, సుండల్‌, పాయసం నివేదిస్తారు. ప్రత్యేక రోజుల్లో క్షీరాన్నం సమర్పిస్తారు.

అమృతకలశం – అమ్మవారి లడ్డూ

పద్మావతి అమ్మవారి ప్రసాదాల్లో విశేష ప్రాచుర్యం పొందింది లడ్డూ ప్రసాదం. దీనిని అమృతకలశం అని కూడా అంటారు. 2000వ సంవత్సరంలో అమ్మవారి ప్రసాదాల్లో లడ్డూను ప్రవేశపెట్టారు.

లడ్డూ ప్రసాదానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. లడ్డూ తయారీకి ఈ కింది సరుకులను వినియోగిస్తారు.

వంద లడ్డూల తయారీకి 4 కిలోల శనగ పిండి, 8 కిలోల చక్కెర, 3 కిలోల నెయ్యి, 90 గ్రాముల యాలకులు, 10 గ్రాముల సొంఠి, 6 గ్రాముల పచ్చకర్పూరం, 5 గ్రాముల జాజికాయలు వినియోగిస్తారు.

వడ ప్రసాదం

లడ్డూ తరువాత వడ ప్రసాదం ప్రాచుర్యం పొందింది. ఒక పడి(59 వడలు) తయారీకి 4 కిలోల ఉద్దిపప్పు, 2 కిలోల బియ్యం, 1.75 కిలోల నెయ్యి, 70 గ్రాముల మిరియాలు, 70 గ్రాముల జీల‌క‌ర్ర‌, 250 గ్రాముల ఉప్పు, 70 గ్రాముల ఇంగువ, 1.14 కిలోల పెసరపప్పు, 700 గ్రాముల జీడిపప్పు వినియోగిస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*