తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం రాత్రి అమ్మవారు విశేషమైన గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.
రాత్రి 7.30 నుండి 11.30 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు.
శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు.
గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి.
జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది.
Leave a Reply