ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో అల‌మేలుమంగ‌

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు బుధ‌వారం ఉదయం శ్రీ అల‌మేలుమంగ అమ్మవారు మోహినీ అలంకారంలో ప‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులను అనుగ్ర‌హించారు.

అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవీగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ కోలాహలంగా సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

పల్లకీలో మోహిని అలంకారం

ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.

మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. మ‌ధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు వ‌సంతోత్స‌వం నిర్వ‌హిస్తారు.

గ‌జ వాహ‌నం

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7.30 నుండి 11 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేష‌మైన గ‌జ వాహ‌నంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*