సిఫారస్సు లేకుండా తిరుమలలో దగ్గర దర్శనానికి మరోదారేది ?

‘ ఇదంతా స్వామి ఇచ్చిన సంపదే. కానీ, స్వామిని ఒక్కసారైనా దగ్గర దర్శనం చేసుకోవాలని ఉంది. అయితే సిఫారస్సులేదు. విఐపీలం కాదు. కానీ స్వామిని తనివితీరా దగ్గర నుంచి దర్శించుకోవాల’ నే కోరిక మాత్రం ఉంది. సాధ్యమవుతుందా? అంటే తిరుమలలో ఏదీ సాధ్యం కాదు అనడానికి లేదు.

ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. సిఫారస్సులు ఏమి లేకుండా స్వామి దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. ఆ మార్గమే శ్రీవాణి ట్రస్టు దర్శనం.

అసలేంటి ఈ శ్రీవాణి ట్రస్టు? దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం ఈ వార్త చదివేయండి.

తిరుమలలో రకరకాల దర్శనాలున్నాయి. వాటిలో కొత్తగా ప్రవేశపెట్టిన దర్శనం శ్రీవారి ట్రస్టు దర్శనం. ట్రస్టంటే ఇదేదో ప్రైవేటు ట్రస్టు ద్వారా చేయించే దర్శనం అనుకోకండి.

హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా మారుమూల పల్లెలకు సైతం తీసుకెళ్ళడానికి గ్రామగ్రామాన వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. అలాగే దీపదూప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్టును ప్రవేశపెట్టింది.

ఈ ట్రస్టుకు విరాళాలను సేకరిస్తోంది. ఈ మేరకు మే నుంచి విరాళాలు మొదలు పెట్టింది. పది వేల నుంచి రూ. 99, 999 విరాళాలను సేకరిస్తుంది. పది వేలు చెల్లించిన వారికి తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాన్ని ఏర్పాటు చేసింది. పది వేల రూపాయలు చెల్లించే వారిలో ఒక టికెట్టును కేటాయిస్తారు.

దీనిపై ఒక్కరు మాత్రమే దర్శనానికి వెళ్ళవచ్చు. అది కూడా ఉచితంగా కాదు. టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టికెట్టు కోసం మళ్ళీ తిరుమల వరకూ రావాల్సిన పని అస్సల్లేదు. ఆన్‌లైన్ విధానంలో ఈ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఈ కోటాలో కూడా రోజుకు 500 మందికి మాత్రమే ఈ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

ఇక శుక్రవారమైతే కేవలం రెండు వందల మందికే అవకాశం దక్కుతుంది. ఒక్కొక్క మనిషి 9 మందికి మించి టికెట్లు కొనడానికి వీల్లేదు. అంటే 90 వేల రూపాయలు చెల్లిస్తే కుటుంబంలో లేదా స్నేహితులు, బంధువులు, ఏ ఇతరులైన 9 మందిని తీసుకెళ్ళవచ్చునన్నమాట. ఈ కోటాలో వచ్చే ప్రతి భక్తుడికి రూ. 500 చెల్లించే దర్శన టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఎలాంటి దర్శనం లభిస్తుంది ?

ఈ కోటా వచ్చే వారిని బిగినింగ్ బ్రేక్ దర్శనంలో తీసుకెళ్ళి స్వామిని దగ్గరుండి దర్శనం చేయిస్తారు. వీరు కులశేఖర పడి అంటే గర్భగుడి సమీపానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు. ఆ తరువాత హారతీ ఇచ్చి పంపుతారు. వేదపండితులతో రంగనాయక మండపంలో ఆశీర్వచనం కల్గిస్తారు. వీరికి కావాల్సినన్ని లడ్డూలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు.

వసతి ఎలా?

వీరి కోసం ప్రత్యేకంగా తగినన్ని గదులను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. వసతిని కూడా కేటాయించిన గదులలో బుక్ చేసుకోవచ్చు. ఒక్కసారి శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇవ్వడానికి ఆన్‌లైన్ సైట్‌లోకి వెళ్లి అక్కడ తెలిపే సూచనల మేరకు నమోదు చేసుకుంటూ పోతే అన్ని సౌకర్యాలు అమరుతాయి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*