భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం అమ్మవారికి నిర్వహించిన స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) శోభాయ మానంగా జరిగింది.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది.
కంకణభట్టర్ వేంపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు.
అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం (కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.
ఏడు రకాల మాలలు
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు.
ఇందులో బాదం, ఎండు ఖర్జూరం, రంగురంగుల రోజాలు, నెల్లికాయలు, నందివర్ధనం, తామరపూల గింజలు, రంగురాళ్లతో కూడిన రోజామాలలు అమ్మవారికి అలంకరించారు. మధ్యలో నారింజ, ఆస్ర్టేలియా ఆపిల్స్, మామిడి, కివి, దానిమ్మ, జామ తదితర ఫలాలను నివేదించారు.
Leave a Reply