పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహ‌న‌సేవ‌లు – వాటి వైశిష్ట్యం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. మొద‌టిరోజు శ‌నివారం ఉదయం 8.30 నుంచి 8.50 గంటల నడుమ వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణం వేడుకగా జరుగనుంది. బ్ర‌హ్మోత్స‌వాల్లో 9 రోజుల పాటు ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7.30 నుండి 11 గంట‌ల వ‌రకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యం ఇలా ఉంది.

చిన్నశేష వాహనం : అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారిని దర్శించిన భక్తులకు యోగసిద్ధి చేకూరుతుంది.

పెద్దశేష వాహనం :  శ్రీపద్మావతి మాతకు కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా పెద్దశేషుడు సేవలందిస్తాడు. శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.

హంస వాహనం : భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ”పరమహంస”లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే నీరు, పాలు వేరు చేయగలగడం. యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హ దయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

ముత్యపుపందిరి వాహనం : ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశాడు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.

సింహ వాహనం : సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హ దయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.

కల్పవృక్ష వాహనం : బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం అమ్మవారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతావ క్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. కోరికలను తీర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రిత భక్తులకు కష్టాలను తొలగించే పరిపూర్ణశక్తి.

హనుమంత వాహనం : హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్యభక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

పల్లకీలో మోహిని అవతారం : బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున ఉదయం మోహిని అవతారంలో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్నిగుర్తుంచుకోలేకపోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

గజవాహనం : శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి పద్మావతి అమ్మవారు స్వర్ణ గజ వాహనంపై విహరిస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*