
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం రాత్రి అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆలయంలో అమ్మవారికి, విష్వక్సేనులకు విశేష పూజలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణాబాధ్యత విష్వక్సేనుల వారిదే కనుక ఆయనకు కూడా పూజలు జరుగుతాయి.
సాయంత్రం 6గంటలపైన అమ్మవారిని, విష్వక్సేనుడిని తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి ఆలయ సమీపంలోని ఉద్యానవనానికి తీసుకొచ్చి కొలువుదీర్చనున్నారు. విష్వక్సేనుడి సమక్షంలో పుట్టమట్టిని సేకరిస్తారు. అనంతరం ఊరేగింపుగా ఆలయంలోని యాగశాలకు చేరుకుని అంకురార్పణ ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు.
కలశాల్లో పుట్టమట్టిని, నవధాన్యాలను నింపి అంకురం చిగురింపజేసే కార్యక్రమమే అంకురార్పణ. ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నది. శనివారం ఉదయం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
అనంతరం సకలదేవతామూర్తులను ఉత్సవ నిర్వహణకు ఆహ్వానం పలికి గజ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగరవేయడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Leave a Reply