పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు ముస్తాబవుతోంది. రంగు రంగుల ముగ్గులను వేసి తిరువీధులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధం చేస్తోంది.
పద్మపుష్కరిణిని శుద్ధి చేసి నీటితో నింపారు. ఆలయం నుండి శిల్పారామం వరకు ప్రధాన రహదారిపై రంగురంగుల విద్యుత్ దీపాలతో తోరణాలు ఏర్పాటుచేశారు. ఆలయ మాడ వీధుల్లో చలువసున్నం, రంగోళీలు తీర్చిదిద్దారు. ఆలయంలోపల ఆలయ పెయింటింగ్ పూర్తి చేసి లైటింగ్ ఏర్పాట్లు చేపడుతున్నారు.
వాహనసేవల కోసం వినియోగించే వివిధ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే వివిధ కైంకర్యాలకు అవసరమైన పూజాసామగ్రి, ఇతర వస్తువుల కొనుగోళ్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అదేవిధంగా ఇంజినీరింగ్, ఆరోగ్య, భద్రత తదితర విభాగాల అధికారులు తమ పరిధిలోకి వచ్చే పనులను వేగవంతం చేశారు.
వాహన వేళల్లో స్వల్పమార్పులు
ప్రతీ ఏడు తిరుచానూరు బ్రహ్మోత్సవాలు కార్తీకమాసంలో జరుగుతాయి. ఈ ఏడాది కూడా నవంబరు 23 నుండి డిసెంబరు 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. నవంబరు 22న అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. మరుసటి రోజు నుంచి అన్న వాహనసేవలు, కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
ఈ యేడాది వేళల్లో మార్పులు తీసుకువస్తున్నారు. గతేడాది వరకు బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 8 నుండి 11 గంటల వరకు వాహనసేవలు నిర్వహించేవారు. భక్తుల కోరిక మేరకు ఈసారి రాత్రి వాహనసేవను అరగంట ముందుగా ప్రారంభించాలని టిటిడి నిర్ణయించింది. అనగా రాత్రి వాహనసేవ 7.30 నుండి 11 గంటల వరకు జరుగుతుంది.
Leave a Reply