తిరుమల తరువాత చెప్పుకోదగిన టీటీడీ ఆలయాల్లో ముఖ్యమైన ఆలయం ఏది?అని అంటే తిరుచానూరు ఆలయం అనే పేరు వెంటనే వస్తుంది. పద్మావతీ అమ్మవారి కొలువున్న ఈ ఊరుకు తిరుమలతో సమానమైన ప్రాముఖ్యత ఉంది. నేటికి ప్రముఖులలో చాలా మంది అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. లేదా తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు ప్రయాణమవుతారు. పైనున్నది అయ్యవారైతే… కింద ఉన్నది అమ్మవారు. అందుకే అంతటి ప్రాధాన్యత అసలు తిరుచానూరుకు ఆ పేరు ఎలా వచ్చింది. ఒక్కసారి పరిశీద్దాం.
పురాణాలు, వాటిని పఠించిన వేద పండితులు చెబుతున్న ప్రకారం, ద్వాపర యుగం చివరలో కలియుగం ప్రథమంలో తిరుచానూరు ఉన్నట్టు తెలుస్తోంది. వైకుంఠంలోని శ్రీవేంకటేశ్వరుడు తన హృదయలక్ష్మి లేకపోవడం వల్ల విరక్తి చెంది స్వర్ణముఖి నదీతీరానికి చేరుకుని తపం ఆచరించి పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం పొందారు. ఆ తరువాత కాలంలో శుక మహర్షి ఈ ప్రాంతానికి చేరుకుని శ్రీమహాలక్ష్మి అనుగ్రహం పొందారట. శుక మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఇది తిరుశుకపురం అయింది.
ఆ తరువాత కాలంలో తిరుశుకనూరుగా, తిరుచానూరుగా మారింది. శాసనాధారాల ప్రకారం ఇక్కడున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి దాదాపు 1100 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. టిటిడి పరిధిలో ఉన్న ఆలయాల్లో పురాతన ఆలయంగా గుర్తింపు పొందింది. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీమత్ తిరుమల కాండూరి శ్రీనివాసాచార్యులు ఈ వివరాలను తెలియజేశారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారు వీరలక్ష్మిగా భక్తులకు అభయమిస్తున్నారు. తరిగొండ వెంగమాంబ రచించిన వేంకటాచల మహత్యం గ్రంథం ప్రకారం శ్రీవారు తపస్సు చేసిన అనంతరం తిరుచానూరులోని పద్మసరోవరంలో సహస్ర స్వర్ణ కమలంలో వీరలక్ష్మి, వ్యూహలక్ష్మిగా ఉద్భవించారు. వ్యూహలక్ష్మి స్వామివారితోపాటు తిరుమలకు వెళ్లి శ్రీవారి వక్షఃస్థలంలో నిలిచారు. వీరలక్ష్మి తిరుచానూరులోనే ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులను దీవించి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు పంపుతున్నారు. ఈ విధంగా అమ్మవారు ఇక్కడ ఒంటరిగా, స్వతంత్రంగా ఉండిపోవడం వల్ల సర్వస్వతంత్ర వీరలక్ష్మిగా ప్రసిద్ధి పొందారు.
Leave a Reply