తిరుమల అర్చకుడి కుండకు బాణమేసిందెవరు?

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామికి అభిషేకం, కైంకర్యాలు నీళ్లు తీసుకువచ్చే అర్చకుడి కుండకు బాణం వేసిందెవరు? ఆ తరువాత ఏం జరిగింది.? ఆ అర్చకుడి ఏం చేశాడు ? ఆకాశగంగ ఎలా ఏర్పడింది? వీటిని గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఈ వార్తను చదవాల్సిందే.

తిరుమలలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాల కోసం దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలోని పాపనాశనం నుంచి నీటిని తీసుకువస్తారు. ఇప్పుడంటే రవాణా సౌకర్యాలు, మార్గాలు బాగుపడ్డాయి. కానీ, అప్పట్లో కారడవి, ఆ అడవిలో తెల్లవారు జామునే వెళ్లి నీళ్ళు తీసుకురావాలంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి.

వర్షాల కాలం, చలి కాలంలో కూడా ఇలా నీళ్లు తీసుకురావడం, అభిషేకానికి కైంకర్యాలకు వాడడం రోజు రోజుకు కష్టంగా మారేది. ఇలాంటి స్థితిలో అర్చకులు యామనాచార్యుల వారు ఆలోచనలో పడ్డారు. ఆ పని ఎవరు చేస్తారని తన శిష్య బృందాన్ని ప్రశ్నించినప్పుడు తిరుమలనంబి ఆ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారట.

తిరుమలనంబి వేంకటేశ్వర స్వామికి పరమభక్తుడు. ఆయన స్వామిని ఆరాధించడంలో ఉంటారు. ప్రతి రోజూ పాపనాశనం నుంచి నీటిని తీసుకు వచ్చి స్వామికి పూజలకు వినియోగించే వారు. ఈ క్రమంలోనే తిరుమనంబి ఓ రోజు కుండ చేతపట్టుకుని పాపనాశనం వెళ్లాడు.

అక్కడ కుండలో నీళ్ళు పట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. కొండలు కోనలు ఎక్కుతూ, దిగుతూ తిరుమలకు వస్తున్నారు. రాను రాను కుండ బరువు తగ్గిపోతోంది. ఇది గమనించి కుండ భుజం మీద ఉండగానే వెనక్కి తిరిగి చూశాడు. నీళ్ళన్ని కారిపోతున్నాయి.

పూర్తిగా వెనక్కి తిరిగి చూస్తే ఓ వేటగాడు విల్లు,బాణం చేతపట్టుకుని కనిపించాడు. ఇదేంటయ్యా…! స్వామి కైంకర్యాన్ని తీసుకెళ్ళే నీటిని ఇలా నేలు పాలు చేశావు. ఇప్పటికే పూజకు సమయం మించిపోతోంది. ఏమిటయ్యా..! ఈ పని అని ప్రశ్నించాడట. అయితే అప్పుడు ఆ వేటగాడు. చింతించవలదని తిరుమలనంబికి చెప్పి తన విల్లును కొండకు ఎక్కుపెట్టి బాణాన్ని గురి చూసి వదిలాడడట.

ఆ బాణం కొండకు తగిలి కన్నం పడి శుద్ధమైన జలం దారలా జాలువారింది. ఈ నీరు కూడా స్వచ్చమైన నీరేనని దానిని స్వామి కైంకర్యాలకు వినియోగించుకోవచ్చునని చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్న కుండలో ఆ నీటిని పట్టుకుని తిరుమలనంబి తిరుమలకు వెళ్ళాడు. పూజకు సమయం మించిపోతోందనే ఆందోళన పడుతున్నాడు.

జరిగిన సంఘటనను తలుచుకుంటూ ఆలయంలోనికి ప్రవేశించగానే వేంకటేశ్వర స్వామి తిరుమలనంబి పలుకరించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేటగాడి రూపంలో వచ్చింది తానేని, ఇకపై అంత దూరం నుంచి నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం లేదని, బాణం వేసిన చోటు నుంచే నీటి తీసుకురావాలని కోరారట. తిరుమలనంబి సంబరమాశ్చర్యాలకు లోనయ్యాడు. అప్పటి నుంచి వేటగాడి రూపంలో బాణం వేసిన ప్రాంతాన్ని ఆకాశగంగగా ముద్రపడింది. ఇప్పటికీ అక్కడ నుంచి నీటిని తిరుమలకు తీసుకువస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*