బూందీ కాంప్లెక్స్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ప‌క్క‌న నిర్మాణంలో ఉన్న బూందీ కాంప్లెక్స్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని టిటిడి ఈవో అనిల్‌ కుమార్ సింఘాల్ ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ భ‌క్తుల సౌక‌ర్యార్థం నాద‌నీరాజ‌నం వేదిక ప‌క్క‌న‌గ‌ల మ‌రుగుదొడ్ల కాంప్లెక్స్‌ను మ‌రింత విస్త‌రించాల‌న్నారు. తిరుమ‌ల‌లో వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నాల ప‌క్క‌న తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్ల‌ను ప‌నులు పూర్త‌యిన వెంట‌నే తొల‌గించాల‌ని సూచించారు.

టిటిడి ఆధ్వ‌ర్యంలో ప‌లు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆల‌యాలకు అనుబంధంగా అర్చ‌కుల క్వార్ట‌ర్లు, ఎఫ్ఎంఎస్ సేవ‌లు, ఇత‌ర సేవ‌లు అందుబాటులో ఉండేలా అధికారులు ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌న్నారు. టిటిడి సీనియ‌ర్ అధికారులు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ స్థానికాల‌యాల్లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల ప్ర‌గ‌తిని స‌మీక్షించాల‌ని జెఈవోను కోరారు.

ఇతర ప్రాంతాల్లోని ఆల‌యాల్లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై ఆయా అధికారుల‌తో 15 రోజుల‌కోసారి జెఈవో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌న్నారు. ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆవిష్క‌రించే పుస్త‌కాల‌ను ముంద‌స్తుగా సిద్ధం చేసుకోవాల‌ని సూచించారు.

టిటిడి విద్యాసంస్థల్లో ప్ర‌వేశానికి సంబంధించిన స్టూడెంట్ అడ్మిష‌న్ అప్లికేష‌న్‌ను ఆల‌స్యం కాకుండా చూడాల‌ని ఐటి అధికారుల‌ను ఈవో ఆదేశించారు. కాల్‌సెంట‌ర్‌కు రోజుకు 2500 నుండి 3 వేల వ‌ర‌కు కాల్స్ వ‌స్తుంటాయ‌ని, వీటిలో ఎక్కువ‌గా ఆర్జిత సేవ‌లు, ఆన్‌లైన్ బుకింగ్, గ‌దులు త‌దిత‌ర స‌మాచారాన్ని భ‌క్తులు అడుగుతుంటార‌ని తెలిపారు.

ఇలాంటి అంశాల‌పై ఎఫ్ఏక్యూలు(త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌లు) త‌యారుచేసి టిటిడి వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చాల‌న్నారు. భ‌క్తుల సూచ‌న‌లు, ఫిర్యాదుల‌ను ఏరోజుకారోజు ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అకౌంట్స్ విభాగంలో ఇఆర్‌పి అప్లికేష‌న్‌పై సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వ‌డం ద్వారా మ‌రింత నాణ్య‌మైన సేవ‌లు పొంద‌వ‌చ్చ‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి తిరుప‌తి జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌, ఎఫ్ఏ,సిఏవో ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ జి.రామ‌చంద్రారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*