దివ్య దర్శనం అంటే ఏమిటి? ఆ దర్శనానికి దారేంటి?

  • ఎక్కడకు రావాలి.?
  • టోకెన్లు ఏమైనా ఇస్తారా?
  • ఏన్ని మెట్లుంటాయి?
  • ఏదైనా ఇబ్బంది కలిగితే?

తిరుమలలో ఎన్నో రకాల దర్శనాలున్నాయి. వాటి దివ్య దర్శనం ఒకటి అసలు ఈ దివ్య దర్శనం అంటే ఏమిటి.? దీనికి ఎవరిని అనుమతిస్తారు? దీనిని ఎలా పొందాలి.? ఇలాంటి ఎన్నో సందేహాలు మదిలో మెదులుతుంటాయి. వాటిని నివృత్తి చేయడానికే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకు వచ్చింది ‘ఏడుకొండలు’

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. మరికొంత మందైతే నడిచి వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. ఒకప్పుడు ఎంత గొప్ప రాజైనా నడిచి వెళ్ళి దర్శనం చేసుకునే వారే. అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, రామానుజచార్యుల వారు ఇలా పేరు మోసి స్వామి భక్తులు విజయనగర సామ్రాజ్యధీశులు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇలా నడిచి స్వామి దర్శనం చేసుకున్న వారే.

అది కాస్త నేడు మొక్కుగా మారిపోయింది. ఆ తరువాత తరాలు ‘స్వామి నీ కొండకు వచ్చి నిలువు దోపిడి ఇస్తాము’, నీ కొండకు మోకాళ్ళపై నడిచి వస్తాము’ ‘ మెట్టు మెట్టుకు పసుపు కుంకాలు, కర్పూరహారతులిచ్చు’కుంటూ వస్తామని మొక్కకునే వారెందరో ఉన్నారు. ఇలా కొండకు నడిచి వచ్చే వారి కోసం టీటీడీ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దర్శనమే విధానమే ‘దివ్య దర్శనం’.

రోజూ కనీసం 20 వేల మంది భక్తులు తిరుమలకు నడుచుకుంటూ వస్తుంటారు. ఇప్పటికీ అంబానీలు మొదలు, ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా నడకదారిన తిరుమల చేరుకుని వారి మొక్కులు తీర్చుకుంటారు. కొండ మార్గాన ఎవ్వరైనా నడి వెళ్ళవచ్చు. ఇలా నడిచి వెళ్ళడానికి ప్రధానంగా రెండు మార్గాలుంటాయి.

1. అలిపిరి మార్గం
2. శ్రీవారి మెట్టు మార్గం

ఈ రెండు మార్గాలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ భక్తులను అనుమతిస్తారు. ఇది కూడా పరిస్థితులను అనుసరించి ఉంటుంది. భక్తులు తమ లగేజీని అలిపిరి, శ్రీవారి మెట్టు సమీపంలో ఏర్పాటు చేసిన లగేజీ కేంద్రంలో అప్పజెప్పితే చాలు. వాటిని టీటీడీ నేరుగా కొండకు చేర్చుతుంది. అయితే వాటికి ఖచ్చితంగా తాళం వేసి ఉండాలనే నిబంధన మాత్రం ఉంటుంది. ఆ తరువాత కొండకు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది.

అలిపిరి మార్గాన 3558 మెట్లు ఉన్నాయి. హుషారుగా నడిచే వారు రెండన్నర గంటలలో తిరుమల చేరుకోవచ్చు. సాధారణంగా నడిచే వారికి 4 గంటల వరకూ సమయం పడుతుంది. అదే విధంగా శ్రీవారి మెట్టు మార్గం 2388 మెట్లు ఉన్నాయి. ఈ మార్గాన ఒకటిన్నరగంట లేదా రెండు గంటలలో తిరుమల చేరుకోవచ్చు. సాధారణంగా నడిచే వారికి 3 గంటల వరకూ సమయం పడుతుంది.

తినడానికి తిండి ఎలా?
మెట్ల మార్గ మధ్యమంలో దుకాణాలుంటాయి. అక్కడ చిరు తిళ్ళు దొరుకుతాయి. చాలా చోట్ల జలప్రసాదం కింద తాగునీటిని ఏర్పాటు చేసి ఉంటారు. నీటిని కూడా భక్తులు మోసుకెళ్ళాల్సిన అవసరమే లేదు. గోవింద నామాలు చేస్తూ నేరుగా తిరుమలకు చేరుకోవడంపై దృష్టి సారిస్తే చాలు. నేరుగా తిరుమల చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. మధ్యమధ్యలో గ్లూకోజ్ వంటివి లభిస్తాయి. ఇక టీటీడీ ఏర్పాటు చేసిన విజిలెన్స్ విభాగ సిబ్బంది గస్తీ తిరుగుతూనే ఉంటారు. ఎటువంటి భయమూ ఆందోళన అక్కరలేదు. సుస్తీ చేసినా, అనారోగ్యమనిపించినా బోర్డులపై ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే చాలు సిబ్బంది వచ్చి సహాయం చేస్తారు.

టోకెన్లు ఏమైనా ఇస్తారా?

తిరుమల చేరుకున్న తరువాత వారికి చాలాసేపు వేచి ఉండేలా కాకుండా సాధ్యమైనంత త్వరగా దర్శనానికి అనుమతిస్తారు. అందుకోసం మెట్ల మార్గంలోనే టోకెన్లు జారీ చేస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలోనైతే వెయ్యి మెట్ల తరువాత టోకెన్లు ఇస్తారు. మరి కొన్ని మెట్లు ఎక్కిన తరువాత దానిని పరిశీలించి సీలు వేస్తారు. ఇక అలిపిరి మెట్ల మార్గంలోనైతే గాలిగోపురం వద్ద టికెట్లు జారీ చేస్తారు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత దానిపై సీలు వేసి పంపుతారు.

దర్శనానికి ఎక్కడికి వెళ్లాలి. ?

తిరుమలలో వెంటనే దర్శనానికి వెళ్ళేవారైనా, కళ్యాణకట్ట నుంచి వచ్చిన తరువాత దివ్య దర్శనానికి వెళ్ళే వారైనా సరే ఏటిసీ కార్ పార్కింగ్ చేరుకోవాలి. అంటే ఆళ్వార్ ట్యాంక్ కాటేజీ కార్ పార్కింగు ప్రదేశానికి చేరుకుని అక్కడ నుంచి దివ్య దర్శనం ద్వారా స్వామిని దర్శించుకోవచ్చు. అయితే శ్రీవారి మెట్టు మార్గాన వచ్చేవారికి ఈ ప్రాంతం కాస్త దగ్గరగా ఉంటుంది. అలిపిరి మార్గాన కొండకు చేరుకునే వారు ఇక నడవలేమనుకుంటే మాత్రం ఉచిత బస్సులను ఎక్కి ఏటీసీ సమీపానికి చేరుకోవచ్చు. లోనికి వెళ్ళిన తరువాత వారు మీకు జారీ చేసిన టికెట్టును పరిశీలించి దర్శనానికి అనుమతిస్తారు. ఈ విధానంలో ఉచిత లడ్డూలు కూడా ఇస్తారు. నడవగలిగే సత్తా ఉంటే సులభంగా దర్శనమయ్యే మార్గం కూడా ఇదే.

కింద ఇచ్చిన లగేజీ మాటేంటి?

తిరుపతిలో టీటీడీకి అప్పజెప్పిన లగేజీ మీరు తిరుమల చేరుకునే లోపు అది కూడా తిరుమల చేరుకుంటుంది. పక్కనే ఏర్పాటు చేసిన కేంద్రాలలో రశీదును చూపి వాటిని పొందడమే. ఇక ఇక్కడ నుంచి భక్తుల ఇష్టం. కళ్యాణకట్టకు వెళ్ళి తలనీలాలు సమర్పించే వారు తలనీలాలు సమర్పించవచ్చు. లేదా నేరుగా దర్శనానికి వెళ్ళే వారు దర్శనానికి వెళ్ళవచ్చు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*