తిరుమల సర్వ దర్శనానికి దారేది?

స్వామిని ఎంత దూరం నుంచి చూడవచ్చు?

తిరుమల క్షేత్రానికి చేరుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. గంటలకు గంటల కొద్ది వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఎటువంటి సిఫారస్సు, ఎటువంటి ప్రత్యేక రుసము లేకుండా స్వామిని దర్శించుకోవాలంటే ఏం చేయాలి ? ఎలాంటి వారు ఈ దర్శనానికి అర్హులు? ఈ దర్శనంలో ఎక్కడ నుంచి స్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది? అనే అంశాలను నేటి వార్తలో పరిశీలిద్దాం.

సర్వదర్శనం… ఈ పేరులోనే దాని పరమార్థం దాగి ఉంది. సర్వజనులు అని. ఎటువంటి సిఫారస్సు లేఖలు, ప్రత్యేక రుసుములు అక్కర లేకుండా స్వామి దర్శించుకునే విధానమే సర్వదర్శన విధానం. ఇలా ప్రతి రోజూ స్వామిని దర్శించుకునే వారి సంఖ్య 30-50 వేల వరకూ ఉంటుంది. రద్దీని బట్టి ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. సర్వదర్శనంలో స్వామిని దర్శించుకోవాలంటే కావలసిందల్లా ఒక్కటే ఓపిక.

ఎప్పుడు రావాలి?

ఎటువంటి సిఫారస్సులు, ప్రత్యేక రుసుము సదుపాయం లేని వారు సర్వదర్శనాన్ని ఎన్నుకుంటారు. ఇలాంటి వారికి ‘ ఏడుకొండలు ’ ఇస్తున్న సలహా ఏమిటంటే సర్వదర్శనంలో వెళ్ళ దలిచిన వారు సాధ్యమైనంత వరకూ శుక్ర, శని, ఆదివారాలలో స్వామి దర్శనానికి తిరుమలకు రావద్దు. ఈ మూడు రోజులలో రద్దీ విపరీతంగా ఉంటుంది. క్యూలైన్లు పట్టకుండా జనం ఉంటారు. ఇలాంటి స్థితి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ సోమ, మంగళ, బుధ, గురువారాలలో తిరుమల దర్శనానికి రావడం ఉత్తమం. కాదు, ఆ రోజుల్లోనే తిరుమలకు రావాలి. తప్పదనుకునే వారికి ఓపిక తప్పని సరిగా ఉండాలి.

ఎక్కడకు రావాలి? సర్వదర్శనానికి ఎలా వెళ్ళాలి?

క్యూలైన్‌లో భక్తులు

తిరుమలకు సర్వదర్శనానికి వెళ్ళడానికి భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎక్కడ దిగిన ఉచిత బస్సులు ప్రతి ఐదు నిమిషాలకు తిరుగుతూనే ఉంటాయి. ఆ బస్సులలో ఎక్కి వైకుంఠం క్యూకాంప్లెక్సు సర్వదర్శన అని చెబితే వారు అక్కడ దింపుతారు. అక్కడ లోనికి ప్రవేశిస్తే క్యూకాంప్లెక్సు కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది రద్దీని బట్టి దర్శన సమయాన్ని నిర్ణయిస్తారు.

మరి భోజన సదుపాయం ఎలా?

భక్తులకు పాలు ఇస్తున్న శ్రీవారి భక్తులు

స్వామి దర్శనానికి వచ్చే వారు ఎటువంటి సరంజామా లేకుండా స్వామిని స్మరించుకుంటూ క్యూ కాంప్లెక్సులోకి చేరుకుంటే మంచింది. రద్దీలోనూ ప్రశాంతంగా దర్శనం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడే కంపార్టుమెంట్లలోనే సాంబరు అన్నం అందిస్తారు. సమయానికి పాలు అందజేస్తారు. తాగునీటి వసతి ఉంటుంది. అలాగే మరుగుదొడ్ల సౌకర్యం ఉంటుంది. ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ, ‘ ఏడుకొండలు ’ పదే పదే మీకు చెబుతున్నది ఒక్కటే, మీకు ఓపిక ఉండాలి. సహనాన్ని కోల్పోతే మీరు ప్రశాంతంగా స్వామి దర్శించుకోలేకపోవచ్చు. సర్వదర్శనం అంటేనే రకరకాల జనం ఉంటారు. కాబట్టి ఓపిక తప్పని పరిస్థితి.

స్వామిని ఎక్కడి నుంచి దర్శించుకోవచ్చు?

జయవిజయుల ద్వారం

రద్దీ పెరిగే కొద్ది వెంకటేశ్వర స్వామికి, ఆయన భక్తులకు దర్శన దూరం పెరుగుతోందనే చెప్పాలి. చాలా కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనంలో వచ్చే వారిని జయవిజయల వద్ద నుంచే దర్శనం చేయించి బయటకు పంపేస్తున్నారు. ఇక్కడ కూడా రద్దీని అనుసరించి లాగేయడం వేగం ఆధారపడి ఉంటుంది. తక్కువ రద్దీ ఉంటే కొంత ప్రశాంతంగా దర్శనం జరుగుతుంది.

రద్దీ ఎక్కువగా ఉంటే అక్కడి సిబ్బంది అక్కడ నుంచి మనల్ని వేగంగా బయటకు పంపేస్తారు. ధ్వజస్థంభం దాటిన తరువాత ఒక్క స్వామి దర్శనం మీద తప్పితే ధ్యాస మరలకూడదు. పక్కనున్న ఆకారాలను, ప్రాకారాలను చూసుకుంటూ ఉంటే స్వామి దర్శనం సరిగా జరగకపోవచ్చు. ఆ తరువాత చింతించి ఉపయోగం ఉండదు. తిరిగి క్యూలోకి చేరడం దాదాపుగా సాధ్యం కాదు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*